డేటా సెంటర్ ప్రెస్‌మీట్‌తో ఆకట్టుకున్న లోకేష్.. క్లారిటీ ఉన్న నాయకుడంటూ టెక్ నిపుణుడి కితాబు

  • మంత్రి నారా లోకేష్ పనితీరుపై టెక్ నిపుణుడు శ్రీధర్ నల్లమోతు ప్రశంసలు
  • డేటా సెంటర్ పురోగతిపై లోకేష్ ప్రెస్‌మీట్‌ను విశ్లేషించిన నల్లమోతు
  • భావోద్వేగాలకు బదులు ఫ్యాక్ట్స్, ఫిగర్స్‌తో మాట్లాడటం లోకేష్ ప్రత్యేకత అని కితాబు
  • కంపెనీలను తీసుకురావడమే కాకుండా స్థానిక యువతకు స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టి
  • సుదీర్ఘమైన విజన్, స్పష్టమైన ఆలోచన ఉన్న నాయకుడు లోకేష్ అని అభిప్రాయం
  • తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని, నిపుణుడిగా మాట్లాడుతున్నానని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ పనితీరు, దార్శనికతపై ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు, 'కంప్యూటర్ మ్యాగజైన్' వ్యవస్థాపకుడు శ్రీధర్ నల్లమోతు ప్రశంసల వర్షం కురిపించారు. ఈరోజు డేటా సెంటర్ ప్రాజెక్ట్ పురోగతిపై లోకేష్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను విశ్లేషిస్తూ, ఆయన నాయకత్వ లక్షణాలను ప్రత్యేకంగా అభినందించారు. భావోద్వేగాలకు తావివ్వకుండా కేవలం వాస్తవాలు, గణాంకాల (ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్) ఆధారంగా లోకేష్ మాట్లాడే విధానం అంతర్జాతీయ స్థాయి బిజినెస్ లీడర్లలో మాత్రమే  కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

దాదాపు 30 ఏళ్లుగా టెక్నాలజీ రంగంలో ఉన్న నిపుణుడిగా తాను లోకేష్ మాటలను నిశితంగా గమనించానని శ్రీధర్ తెలిపారు. ఒక ప్రాజెక్ట్‌ను 12 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, కొన్ని అనుమతుల కారణంగా 13 నెలలు పట్టిన విషయాన్ని కూడా లోకేష్ దాపరికం లేకుండా, పూర్తి వివరాలతో వివరించడం ఆయనకున్న స్పష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి 'గ్రోత్ మైండ్‌సెట్' ఉన్న నాయకులు మాత్రమే ఒక అంశంపై దీర్ఘకాలం దృష్టి సారించి, అడ్డంకులను అధిగమిస్తూ లక్ష్యాన్ని చేరుకోగలరని విశ్లేషించారు.

"ఒక నాయకుడిగా ఎన్నో పనుల మధ్య సమన్వయం చేసుకుంటూ, ఒక ప్రాజెక్టు పురోగతిని ట్రాక్ చేస్తూ, దాన్ని విజయవంతంగా ఒక దశకు తీసుకురావడం కమిట్‌మెంట్ ఉన్నవారికే సాధ్యం. లోకేష్ మాటల్లో ఆ కష్టం, తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి," అని శ్రీధర్ నల్లమోతు అన్నారు. కేవలం కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా, స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) పై కూడా ప్రభుత్వం దృష్టి సారించడం లోకేష్ సుదీర్ఘ విజన్‌కు నిదర్శనమని కొనియాడారు.

ప్రతిపక్షాల విమర్శలపై కూడా ఎక్కడా సంయమనం కోల్పోకుండా, తిరిగి అభివృద్ధి ఎజెండాపైకి రావడం ఆయన పరిణతిని చూపిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడు తర్వాత రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దగల సత్తా, ప్రపంచంలోని ఏ సంస్థనైనా ఒప్పించి ఏపీకి తీసుకురాగల సామర్థ్యం లోకేష్‌లో కనిపిస్తున్నాయని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆచరణాత్మక దృక్పథం ఉన్న నాయకుడు తెలుగు సమాజానికి లభించడం ఒక అదృష్టమని ఆయన పేర్కొన్నారు.

తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని, పూర్తిగా తటస్థుడిగా, రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వ్యక్తిగా మాత్రమే ఈ విశ్లేషణ చేస్తున్నానని శ్రీధర్ నల్లమోతు స్పష్టం చేశారు.


More Telugu News