టాటా గ్రూపులో ముసలం.. నోయెల్ టాటాపై తిరుగుబావుటా!

  • టాటా ట్రస్ట్స్‌లో బయటపడ్డ తీవ్ర విభేదాలు
  • ఛైర్మన్ నోయెల్ టాటాపై అసంతృప్తితో పలువురు ట్రస్టీలు
  • టాటా సన్స్ బోర్డు నియామకాలపై అభ్యంతరాలు
  • ఆలస్యమవుతున్న టాటా సన్స్ ఐపీఓపై తీవ్ర చర్చ
  • ఈ నెల‌ 10న వాడివేడిగా జరగనున్న బోర్డు సమావేశం
భారత కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపులో అంతర్గత విభేదాలు రాజుకున్నట్టు తెలుస్తోంది. టాటా ట్రస్ట్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా నాయకత్వంపై కొందరు ట్రస్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 10న జరగనున్న ట్రస్ట్ బోర్డు సమావేశం ఈ పరిణామాల నేపథ్యంలో వాడివేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.

టాటా గ్రూప్‌కు మాతృసంస్థ అయిన టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్స్‌కు 60 శాతానికి పైగా వాటా ఉంది. ఇటీవలే టాటా సన్స్ బోర్డులోకి కొందరి పేర్లను నోయెల్ టాటా ప్రతిపాదించగా, నలుగురు ట్రస్టీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దీంతో ఛైర్మన్, సభ్యుల మధ్య దూరం పెరిగినట్టు సమాచారం. ఈ వివాదం ఈ నెల‌ 10వ తేదీ భేటీలో ప్రధాన చర్చనీయాంశంగా మారనుంది.

టాటా సన్స్ ఐపీఓ జాప్యంపై తీవ్ర చర్చ
మరోవైపు టాటా సన్స్ ఐపీఓ విషయంలో నెలకొన్న జాప్యం కూడా ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం గత నెలాఖరు నాటికే ఈ ఐపీఓ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, సెబీ అనుమతులున్నా టాటా గ్రూప్ ముందుకు వెళ్లలేకపోయింది. ఈ జాప్యం వెనుక నోయెల్ టాటా ఉన్నారని కొందరు ట్రస్టీలు ఆరోపిస్తున్నారు.

టాటా సన్స్‌లో 18.37 శాతం వాటా ఉన్న షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) గ్రూప్, తమ అప్పులు తగ్గించుకునేందుకు ఐపీఓ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తోంది. ఐపీఓ ద్వారా తమ వాటాను మార్కెట్ ధరకు విక్రయించి బయటపడాలని ఆ సంస్థ భావిస్తోంది. అయితే, ఎస్పీ గ్రూప్ అధినేత సోదరే నోయెల్ టాటా భార్య కావడంతో ఆయన ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ట్రస్టీలు విమర్శిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కీలక అంశాలపై రాబోయే బోర్డు సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News