ఆస్ట్రేలియాలో భార‌తీయ విద్యార్థిపై దాడి

  • ఈ నెల 19న అడిలైడ్‌లో ఘ‌ట‌న
  • తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాధితుడికి ఆసుప‌త్రిలో చికిత్స‌
  • భార్య‌తో క‌లిసి బ‌య‌టకు వెళ్లిన స‌మ‌యంలో ఘ‌ట‌న‌
  • నిందితుల్లో ఒక‌రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆస్ట్రేలియాలో భార‌తీయ విద్యార్థిపై కొంద‌రు దుండ‌గులు దాడికి పాల్ప‌డ్డారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ బాధితుడు ఆసుప‌త్రిలో చేరాడు. ఈ నెల 19న అడిలైడ్‌లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. భార‌త్‌కు చెందిన చ‌ర‌ణ్‌ప్రీత్ సింగ్ త‌న భార్య‌తో క‌లిసి బ‌య‌ట‌కు వెళ్లారు. త‌మ కారును పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేసి, న‌డిచి వ‌స్తున్న స‌మ‌యంలో మ‌రో కారులో వ‌చ్చిన ఐదుగురు దుండ‌గులు చ‌ర‌ణ్ సింగ్‌పై దాడికి దిగారు. తీవ్రంగా కొట్ట‌డంతో అత‌డు స్పృహ‌త‌ప్పి ప‌డిపోయాడు. అప‌స్మార‌క స్థితిలో ఉన్న అత‌డిని కొంద‌రు స్థానికులు ఆసుప‌త్రిలో చేర్పించారు.

ఆసుప‌త్రిలో చ‌ర‌ణ్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ... ఈ దాడి త‌న‌ను తీవ్రంగా క‌లిచి వేసింద‌ని, ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడు తిరిగి భార‌త్‌కు వెళ్లిపోవాల‌నిపిస్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. కాగా, ఈ దాడికి పాల్ప‌డిన నిందితుల్లో 20 ఏళ్ల ఓ యువ‌కుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మిగిలిన‌ నిందితుల‌ను కూడా ప‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అయితే, కారు పార్కింగ్ విష‌యంలోనే వివాదం చెల‌రేగింద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు పేర్కొన్న‌ట్లు ప‌లు ఆంగ్ల మీడియా క‌థ‌నాలు వెల్ల‌డించాయి.      


More Telugu News