Chandrababu Naidu: ఎందరు పిల్లలుంటే అంత సంతోషమని ఆ సినిమాలో చూపించారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Announces New Population Policy Soon
షార్ట్స్‌లో చూడండి
దేశానికి బలమైన ఆర్థికవనరు జనాభేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామని అన్నారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. నాడు ఎన్టీఆర్ తాతమ్మ కల అనే సినిమా తీశారని, ఎందరు పిల్లలుంటే అంత సంతోషమని అందులో చూపించారని వివరించారు. పిల్లలను కనే వరం భగవంతుడు మహిళలకు ఇచ్చాడని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 

రాష్ట్ర సచివాలయం వద్ద ప్రపంచ జనాభా దినోత్సవంపై మొదటి అమరావతి సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా జనాభా నిర్వహణా విధానం ప్రతి కుటుంబం ముఖ్యం-మీ అభిప్రాయం మార్గదర్శనం అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన సర్వేను సీఎం ప్రారంభించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రత్యుత్పత్తి రేటు పెరగాలి

ఒకప్పుడు జనాభా పెద్ద సమమ్యగా ఉండేది. 2004కు ముందు సీఎంగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణకు ప్రోత్సాహకాలు ఇచ్చాను. ఇద్దరు పిల్లల కంటే ఎక్కుమంది ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులని చేస్తూ చట్టాన్ని తెచ్చాను. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీకి అర్హులుగా చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలు మాత్రమే కాదు, దేశం అంటే మనుషులు.

మన బలం మానవ వనరులు

ఈ రోజు ప్రపంచంలో 10 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్నవారు 1.8 బిలియన్లు ఉన్నారు. ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనగా చూసేవారు. కానీ జనాభా ఉన్న దేశాలవైపే అగ్రరాజ్యాలు చూడాల్సి వస్తోంది. జనాభా ఎప్పటికీ భారం కాదు...అదే మనకు తిరుగులేని ఆస్తి. ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో అభివృద్ధి సాధ్యమా అనే పరిస్థతి నుంచి ఆ జనాభానే మనకు అడ్వాంటేజ్‌గా మారింది. 140 కోట్ల జనాభా కలిగి ఉన్న మన దేశం చైనాను కూడా వెనక్కు నెట్టింది.

యువశక్తి తగ్గి... వృద్ధులు పెరుగుతున్నారు

ఏ దేశంలోనైతే వయోజన సమస్య వస్తుందో అక్కడ వృద్ధిరేట్ నిలిచిపోతుంది. భవిష్యత్‌లోనూ సమస్యలు వస్తాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో సంతానోత్పత్తి రేట్ పడిపోతోంది. అమెరికాలో 1.62 శాతం, యూకేలో 1.54 శాతం, హంగేరిలో 1.50 శాతం, ఫ్రాన్స్‌లో 1.49 శాతం, రష్యాలో 1.47 శాతం, జర్మనీలో 1.46 శాతం, కెనడాలో 1.33 శాతం, జపాన్‌లో 1.23 శాతం, చైనాలో 1.02 శాతం, సింగపూర్‌లో 0.96 శాతం ఉంది. సంపన్న దేశాల్లో తక్కువ జననాల రేటు కన్పిస్తోంది. 

పిల్లలను కనేవారికి విదేశాల్లో ప్రోత్సాహకాలు

జపాన్‌లో పిల్లలు స్కూలుకు వెళ్లే వరకు చైల్డ్ కేర్ సేవలను అందించడంతో పాటు పిల్లల చదువుకు ఆర్థిక సాయం లేదా ఉచిత విద్యను అందిస్తున్నారు. ఎక్కువమంది పిల్లలుంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయంతో పాటు తక్కువ రెంట్‌తో ఇల్లు అద్దెకు ఇస్తున్నారు. దక్షిణ కొరియా దేశంలో నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు అందించడంతోపాటు వివాహం, కాన్పులకు, ఐవిఎఫ్ గర్భధారణకు సాయం చేస్తున్నారు. సింగపూర్ దేశంలో  బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత నగదు అందిస్తున్నారు. మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్మును జోడించి పిల్లల ఖాతాల్లో వేస్తున్నారు. 

రష్యాలో రెండవ బిడ్డను కంటే ఫ్రీ హెల్త్‌కేర్ కింద గర్భిణీలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. హంగేరీలో నలుగురు కంటే ఎక్కువ పిల్లులు ఉన్న వారికి జీవితాంతం ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నారు. చైనాలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే రూ.12 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నారు.

ఖర్చులు పెరుగుతున్నాయని పిల్లల్ని కనడం లేదు

జనాభా తగ్గిపోతే వృద్ధి రేటు పడిపోతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదలపై సమావేశంలో పోల్ నిర్వహిస్తే ఇద్దరు పిల్లలుండాలని 67.41 శాతం మంది, ఒకరే ఉండాలని 12.34 శాతం మంది, ముగ్గురు పిల్లలుండాలని 19.88 శాతం మంది అభిప్రాయపడ్డారని వివరించారు. పిల్లలను కనడానికి యువత ఆస్తకి చూపడం లేదని, చాలా మంది భార్యాభర్తలు పిల్లలను వద్దనుకునే పరిస్థితికి వచ్చారని అన్నారు. ఖర్చులు పెరుగుతాయని పిల్నల్లి కనడానికి ఇష్టపడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్నాయి

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి... రానురాను అవి కనుమరుగవుతున్నాయి. గత కొన్నేళ్ల వరకు ఇంట్లో ప్రతి ఒక్కిరికీ 5 కేజీల చొప్పున బియ్యం ఇచ్చేవాళ్లం. ఐదుగురు ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్లం. అంతకంటే ఎక్కువమంది ఉంటే బియ్యం ఇచ్చేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక కుటుంబంలో పది మంది ఉన్నా 50 కేజీల కంటే ఎక్కువ ఇచ్చేదానిపై ఆలోచిస్తున్నాం. దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.  భవిష్యత్‌లో పార్లమెంటు సీట్లు పెరుగుతాయి.. కానీ దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాలకు సీట్లు తగ్గిపోతాయని కొందరు ఆందోళన చెందుతున్నారు... అని చంద్రబాబు వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ మహేంద్ర దేవ్, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సుహానీ జలోటా, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్ ఎమ్.ప్రకాశమ్మ, ప్రొఫెసర్ సంజయ్ కుమార్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Population policy
Andhra Pradesh
Amaravati
Population growth
Fertility rate
Demographic dividend
Family planning
India population
Economic development

More Telugu News