ఏం చెప్పి భారత్-పాక్ లను బుజ్జగించాడో వెల్లడించిన ట్రంప్!

  • భారత్-పాక్ అణుయుద్ధం ఆపాను: ట్రంప్
  • వాణిజ్య ఒప్పందాలను దౌత్య సాధనంగా ఉపయోగించానని వెల్లడి
  • యుద్ధం ఆపితే మీతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటానని చెప్పానని వివరణ
  • ఓ దశలో భారత్, పాక్ మధ్య ప్రమాదకర పరిస్థితి నెలకొందన్న ట్రంప్
  • తాము జోక్యం చేసుకుని లక్షలాది మంది ప్రాణాలను కాపాడమని స్పష్టీకరణ
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ మొట్టమొదట ప్రకటించిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆ రెండు అణ్వస్త్ర దేశాలను తాను ఎలా ఒప్పించానన్నది ట్రంప్ తాజాగా వెల్లడించారు. వాణిజ్య ఒప్పందాలను ఒక దౌత్య సాధనంగా ఉపయోగించి ఈ ఘర్షణను నివారించగలిగానని ట్రంప్ పేర్కొన్నారు. ఎందుకిలా ఘర్షణ పడతారు... మీతో వాణిజ్యానికి అమెరికా సిద్ధంగా ఉంది... మీరు శాంతించండి... మీతో మేం బోలెడెన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాం అని భారత్, పాక్ వర్గాలకు చెప్పామని వివరించారు.

"నా పరిపాలన హయాంలో, అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాం" అని ఆయన తెలిపారు. ఆ సమయంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని, ఇరు దేశాలు భీకరంగా పోరాడుకునే స్థితిలో ఉన్నాయని ట్రంప్ వివరించారు.

ఈ సంక్షోభ సమయంలో ఇరు దేశాల నాయకత్వాల గురించి ప్రస్తావిస్తూ, "భారత్, పాకిస్థాన్ ప్రభుత్వాల నాయకత్వాలు శక్తిమంతమైనవి, దృఢంగా నిలబడ్డాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని చల్లార్చడానికి వాణిజ్యాన్ని ఒక దౌత్య వ్యూహంగా ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. ఈ జోక్యం ద్వారా లక్షలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న అణు సంఘర్షణను తాము ఆపగలిగామని ట్రంప్ ముగించారు.


More Telugu News