ICC: టీ20 వరల్డ్ కప్ వివాదం.. పాకిస్థాన్ డిమాండ్లకు ఐసీసీ నో!

ICC Rejects Pakistan Demands Regarding T20 World Cup
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బెదిరించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), ఐసీసీ మధ్య నెలకొన్న వివాదం తుది అంకానికి చేరుకుంది. ఈ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఐసీసీ మధ్య జరిగిన సమావేశంలో పాకిస్థాన్ పెట్టిన పలు కీలక డిమాండ్లను జై షా నేతృత్వంలోని ఐసీసీ తిరస్కరించినట్లు తెలుస్తోంది.

దాదాపు రూ.4,000 కోట్ల విలువైన ఈ మ్యాచ్‌ను కాపాడుకునేందుకు జరిగిన చర్చల్లో పీసీబీ కొన్ని ప్రధాన షరతులు విధించింది. అయితే, భారత్‌కు సంబంధించిన డిమాండ్లను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది. ఈ చర్చల వివరాలను ఎన్డీటీవీ తన కథనంలో వెల్లడించింది.

పాక్ డిమాండ్లు.. ఐసీసీ స్పందన
టీ20 ప్రపంచకప్‌లో ఆడని బంగ్లాదేశ్‌పై ఎలాంటి ఆర్థిక జరిమానా విధించరాదని పాకిస్థాన్ కోరగా, ఆ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌కు నష్టపరిహారంగా అదనపు ఐసీసీ ఈవెంట్ కేటాయించాలని పీసీబీ డిమాండ్ చేయగా, వచ్చే సైకిల్‌లో అండర్-19 ప్రపంచకప్‌ను పరిశీలిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.

అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగేలా చూడాలని, అలాగే భారత్, పాక్, బంగ్లాదేశ్‌లతో ట్రై-సిరీస్ నిర్వహించాలని పీసీబీ చేసిన ప్రతిపాదనలను ఐసీసీ తోసిపుచ్చింది. ద్వైపాక్షిక సిరీస్‌లు, పర్యటనలు తమ పరిధిలోకి రావని, అవి పూర్తిగా రెండు దేశాల బోర్డులు నిర్ణయించుకోవాల్సిన విషయాలని స్పష్టం చేసింది. 2026లో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించేలా చూడాలన్న విజ్ఞప్తిని కూడా ఇదే కారణంతో తిరస్కరించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో తమ దేశ ప్రధానితో సంప్రదింపుల కోసం 24 గంటల సమయం కావాలని పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ కోరారు. తదుపరి సమావేశం త్వరలో జరగనుండగా, రాబోయే 24 గంటల్లో ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Go Back to Shorts
ICC
Mohsin Naqvi
PCB
T20 World Cup
India vs Pakistan
Pakistan Cricket Board
Jay Shah
Bilateral Series
Bangladesh Cricket Board
Cricket

More Telugu News