Puri Jagannadh: అరమాయిక్ భాష గురించి పూరి జగన్నాథ్ ఏమన్నారంటే...!

Puri Jagannadh on the Aramaic Language

  • జీసస్ క్రీస్తు మాట్లాడిన భాష అరమాయిక్: పూరి జగన్నాథ్
  • ఇప్పుడు ఇంగ్లిష్ మాదిరిగా అప్పుడు అరమాయిక్ ఉండేదని వెల్లడి
  • మూడువేల సంవత్సరాల నాటి అరమాయిక్ భాష అంతరించిపోతోంది: పూరీ జగనాథ్
  • అరమాయిక్ భాషలో ఉన్న ఎన్నో గ్రంథాలు హిబ్రూలోకి తర్జమా చేశారన్న పూరి జగన్నాథ్ 

అంతరించిపోతున్న అరమాయిక్ భాష గురించి ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పూరి మ్యూజింగ్స్ పేరుతో పూరి జగన్నాథ్ ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో ఆయన అరమాయిక్ భాష గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అరమాయిక్ భాషను అప్పట్లో బిజినెస్ లాంగ్వేజ్ అనేవారని, ప్రస్తుతం అంతరించిపోతోందని తెలిపారు.

మూడు వేల సంవత్సరాల క్రితం హిబ్రూ, అరబిక్‌కు దగ్గరగా ఉన్న భాష అరమాయిక్ అని చెప్పారు. పర్షియా, మెసొపొటేమియాలో ఈ భాష మాట్లాడేవారని తెలిపారు. అస్సిరియన్, బాబిలోనియన్, పర్షియన్ రాజ్యాల్లో ఇది ప్రాథమిక భాషగా ఉండేదన్నారు. జీసస్ క్రీస్తు మాట్లాడిన భాష అరమాయిక్ అని, అందుకే బైబిల్‌లో చాలా అంశాలు అరమాయిక్‌లో రాశారని ఆయన చెప్పారు.

10వ శతాబ్దంలో సిరియా, ఇరాక్‌లో ఉండే సెమిటిక్ ప్రజలైన అర్మేనియన్ల ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. దీనికి సంబంధించిన గ్రంథాలు 850 బీసీలో లభించాయని చెప్పారు. ఆ రోజుల్లో దాన్ని వ్యాపార భాష అనేవారని చెప్పారు. 7వ శతాబ్దంలో బాబిలోనియా, పర్షియా, ఈజిప్ట్ నుంచి ఇండియా వరకు అది సాధారణ భాష అయిందన్నారు.

ఇప్పుడు ఇంగ్లిష్ మాదిరిగా అప్పుడు అరమాయిక్ ఉండేదన్నారు. అరమాయిక్ నుంచి ఎన్నో భాషలు, యాసలు పుట్టుకొచ్చాయని, ఇప్పటికీ ఇరాక్, సిరియా, టర్కీ, ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల వారు ఎక్కువగా అరమాయిక్ మాట్లాడతారని తెలిపారు. దాదాపు ఏడు లక్షల మంది వరకు ఈ భాష మాట్లాడేవారు ఉన్నారని చెప్పారు.

2004లో వచ్చిన మూవీ 'ది ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్'లో అరమాయిక్ భాషలో డైలాగ్స్ ఉన్నాయన్నారు. 22 అక్షరాలు ఉండే ఈ భాష ఇప్పుడు అంతరించిపోతోందని అన్నారు. అందుకే అరమాయిక్ భాషలో ఉన్న ఎన్నో గ్రంథాలను హిబ్రూలోకి తర్జమా చేసుకున్నారని చెప్పారు.

అరమాయిక్ ఒక భాష మాత్రమే కాదని చరిత్ర శాసించే ఓ శబ్దమని చెబుతారన్నారు. యూట్యూబ్‌లో ఉన్న అరమాయిక్ సాంగ్స్ వింటే చాలా బాగుంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో కూడా ఈ భాషను నేర్చుకోవచ్చని, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అరమాయిక్ కోర్సులు కూడా ఉన్నాయని పూరి జగన్నాథ్ తెలిపారు. 

Puri Jagannadh
Aramaic Language
Extinct Language
Ancient Language
Jesus Christ
Bible
Semitic Language
Middle East
Linguistics
Oxford University
  • Loading...

More Telugu News