Pawan Kalyan: రెండు కూనలతో సహా చిరుత మృతిపై పవన్ కల్యాణ్ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిక్కుకొని ఓ చిరుత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో చిరుతతో పాటు దాని గర్భంలోని రెండు కూనలు కూడా మృతి చెందడం అందరినీ కలచివేసింది. ఈ దారుణ ఉదంతంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే, అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటిపాళెం సమీపంలోని అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న పొలం గట్టుపై గుర్తుతెలియని వ్యక్తులు ఉచ్చును అమర్చారు. దురదృష్టవశాత్తు, ఆ మార్గంలో వచ్చిన ఓ ఆడ చిరుత ఆ ఉచ్చులో చిక్కుకుపోయింది. బయటపడేందుకు అది తీవ్రంగా ప్రయత్నించింది. దాదాపు 8 గంటల పాటు నరకయాతన అనుభవించిన ఆ చిరుత, చివరికి ప్రాణాలు విడిచింది. మరణించిన చిరుత గర్భంతో ఉందని, దాని కడుపులో రెండు కూనలు కూడా ఉన్నాయని, అవి కూడా చనిపోయాయని అధికారులు గుర్తించారు.

ఈ హృదయ విదారక ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. క్షేత్రస్థాయి నుంచి అందిన ప్రాథమిక సమాచారం, శాఖాపరమైన నివేదికలను పరిశీలించిన ఆయన, ఘటన అనంతరం సంబంధిత అధికారులు ఎలా స్పందించారనే దానిపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశిస్తూ, పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) చలపతిరావును విచారణ అధికారిగా నియమించారు.

అంతేకాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేట కోసం ఉచ్చులు వేసే వారిపై, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా పెంచాలని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 
Pawan Kalyan
Leopard Death
Andhra Pradesh
Annamayya District
Wildlife Crime
Forest Department
Poaching
Cubs
PCCF Chalapathi Rao
Wildlife Conservation

More Telugu News