Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మకంగా మారిన ‘వక్ఫ్’ ఆందోళన

- ముర్షీదాబాద్‌లో ఆందోళనకారుల నిరసన
- నిమ్టిటా స్టేషన్‌లో ఆగివున్న రైలుపై రాళ్లదాడి
- పదిమంది పోలీసులు, ప్రయాణికులకు గాయాలు
- పలుచోట్ల పోలీసులతో ఘర్షణ.. వాహనాలకు నిప్పు
- తీవ్రంగా స్పందించిన గవర్నర్ సీవీ ఆనంద్ బోస్
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ‘వక్ఫ్’ బిల్లుపై నిన్న జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. నిమ్టిటా స్టేషన్‌లో ఆగి ఉన్న రైలుపై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బీఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించాల్సి వచ్చింది. ఈ ఘటనతో రెండు రైళ్లను రద్దు చేశారు. మరో ఐదు రైళ్లను దారి మళ్లించారు. ఈ దాడిలో కొందరు ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి.
మరోవైపు, ముర్షీదాబాద్‌లోనూ పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు వాహనాలను తగలబెట్టి విధ్వంసం సృష్టించారు. ఈ హింసాత్మక ఘటనలపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తీవ్రంగా స్పందించారు. హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు తెలిపారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
హింసాత్మక ఘటనలకు కారణమైన వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాడులు ప్రారంభించారు. ఈ నెల 16న ఇమాములతో కోల్‌కతాలో మమతా బెనర్జీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆందోళనకారులు శాంతించాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ కోరారు. వక్ఫ్ చట్టాన్ని నిరసిస్తూ మంగళవారం ముర్షీదాబాద్‌లో ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు. అప్పటి నుంచి ప్రతి రోజూ ఆందోళనలు కొనసాగుతుండగా నిన్న ఇవి హింసాత్మకంగా మారాయి.