స్వాతంత్ర్య సమరంలో పాలుపంచుకోని వాళ్లు ఇప్పుడు పటేల్ వారసులమని చెప్పుకుంటున్నారు: ఖర్గే

  • జాతీయ నాయకులపై బీజేపీ, ఆరెస్సెస్ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణ
  • ఆరెస్సెస్ సిద్ధాంతాలు పటేల్ భావజాలానికి వ్యతిరేకమన్న ఖర్గే
  • దేశంలో ప్రాథమిక సమస్యల నుంచి దృష్టిని మరల్చుతున్నారని ఆరోపణ
స్వాతంత్ర్య సమరంలో ఏమాత్రం పాలుపంచుకోని వారు ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులమని చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశం కోసం పోరాడిన జాతీయ నాయకులపై బీజేపీ, ఆరెస్సెస్ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. ఆరెస్సెస్ సిద్ధాంతాలు పటేల్ భావజాలానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. దేశంలో మతపరమైన విభజనలకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

భారత్‌లోని ప్రాథమిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్లుగా దేశం కోసమే పని చేస్తోందని, అలాంటి పార్టీకి దేశంలో వ్యతిరేక పరిస్థితులను సృష్టిస్తున్నారని ఆరోపించారు. స్వతంత్ర దేశం కోసం ఏమీ చేయని వారు ఇప్పుడు తమ పార్టీని అంతం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

పటేల్, నెహ్రూ కలిసి దేశం కోసం పనిచేశారని ఖర్గే అన్నారు. వారి మధ్య మంచి సంబంధాలు ఉండేవని, నెహ్రూ అన్ని విషయాలపైనా పటేల్ సలహాలు తీసుకునేవారని అన్నారు. సలహాల కోసం స్వయంగా నెహ్రూనే పటేల్ ఇంటికి వెళ్లేవారని, పటేల్ సౌలభ్యం కోసం సీడబ్ల్యూసీ సమావేశాలు ఆయన ఇంట్లోనే నిర్వహించేవారని తెలిపారు. అలాంటి గొప్ప నాయకులపై బీజేపీ, ఆరెస్సెస్ దుష్ప్రచారం చేస్తున్నాయని ఖర్గే మండిపడ్డారు.


More Telugu News