Renu Desai: మీ ఇంటికి వచ్చి మీ అమ్మానాన్నను కలిసి మీ దుర్మార్గాలను ఎండగడతా: రేణుదేశాయ్ ఆగ్రహం

Renu Desai Warns Against Social Media Abuse
  • సోషల్ మీడియాలో అసభ్యపదజాలం ఉపయోగించినవారిపై రేణుదేశాయ్ మండిపాటు
  • ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని అసభ్యపదజాలంతో ద్వేషిస్తున్నారని ఆందోళన
  • విడాకులు మొదలు కుక్కలపై ప్రెస్ మీట్ వరకు రకరకాల కామెంట్లు పెట్టారన్న రేణుదేశాయ్
తన గురించి సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేసే ప్రతి ఒక్కరిని గుర్తించి, వారి ఇంటికి వెళ్లి మరీ వాళ్ల అమ్మానాన్నల ముందు నిలబెడతానని ప్రముఖ సినీ నటి రేణుదేశాయ్ అన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని నిత్యం అసభ్యపదజాలంతో ద్వేషించే వారు పెరిగిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

తాను విడాకులు తీసుకున్న దగ్గరి నుంచి కొంతమంది వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితం, తీసుకున్న భరణం, మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీ ఇలా దేనిని వదిలిపెట్టకుండా కామెంట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో వీధికుక్కల అంశంపై తాను హైదరాబాద్‍‌లో మీడియా సమావేశం నిర్వహించానని గుర్తు చేశారు.

ఓ ఎన్జీవో బృందం బలవంతంగా ఈ ప్రెస్ మీట్‌కు రప్పించిందని, ఆరోజు కూడా తాను పది చెడ్డ కుక్కల కోసం 90 మంచి కుక్కలను చంపడమేమిటని మాత్రమే ప్రశ్నించానని అన్నారు. దీంతో తనపై అసభ్యపదజాలంతో విరుచుకుపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావిస్తూ ఇష్టారీతిన మాట్లాడారని అన్నారు. మీవాళ్లు మిమ్మల్ని ఇదే సంస్కారంతో పెంచారా అని ప్రశ్నించారు. మీరు చేసే పని మీ అమ్మానాన్నకు, అక్కాచెల్లెళ్లకు చూపించాలన్నారు.

వీధి కుక్కల సంరక్షణ కోసం నేను ఎన్జీవోను పెట్టాను తప్ప మనుషుల కోసం కాదని గుర్తించాలని రేణూదేశాయ్ అన్నారు. కాబట్టి తనను తిట్టడానికి ఎవరికీ హక్కు లేదని అన్నారు. మరో ఘటనలో చిన్నపిల్ల చనిపోతే తన మాటలను ఎడిట్ చేసి ఆ ఘటనకు అటాచ్ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మీలాంటి వారిని వెతుక్కుంటూ వచ్చి మీ అమ్మానాన్న వద్ద మీ దుర్మార్గాలను ఎండగడతానని హెచ్చరించారు. దిగజారిన వాళ్లు మాత్రమే మరో వ్యక్తిపై దారుణమైన కామెంట్లు చేస్తారని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యపదజాలం ఉపయోగించకూడదని రేణుదేశాయ్ విజ్ఞప్తి చేశారు.
Renu Desai
Renu Desai comments
social media abuse
cyberbullying
online harassment
fake accounts

More Telugu News