ఆఫ్ఘన్ కుర్రాళ్లు గెలుపును అల‌వాటుగా మార్చుకున్నారు: స‌చిన్‌ ప్రశంసలు

Sachin Tendulkar Praises Afghanistan after Win against England in Champions Trophy 2025
  • త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో స‌త్తాచాటిన‌ ఆఫ్ఘాన్
  • ఇంగ్లండ్‌ను ఓడించి ఇంటికి పంపిన వైనం
  • ఆఫ్ఘ‌నిస్థాన్ అద్భుత విజ‌యం ప‌ట్ల సర్వత్రా ప్ర‌శంస‌లు  
  • తాజాగా ఆ జ‌ట్టును ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తిన స‌చిన్‌
ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేసింది. 8 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జ‌ట్టును ఓడించింది. ఒకానొక ద‌శ‌లో ఆఫ్ఘాన్ ఓడిపోతుంద‌నే అనిపించింది. కానీ, చివ‌రి రెండు ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. టోర్నీలో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘన్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు.  

ఈ ప‌రాజ‌యంతో ఇంగ్లండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. 326 పరుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆ జ‌ట్టు 317 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జో రూట్ సెంచ‌రీ (120)తో రాణించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఇక ఆఫ్ఘ‌నిస్థాన్ సాధించిన ఈ అద్భుత విజ‌యం ప‌ట్ల సర్వత్రా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. గ‌త కొంత‌కాలంగా ఆ జ‌ట్టు నాణ్య‌మైన క్రికెట్ ఆడుతోంద‌ని ప‌లువురు మెచ్చుకుంటున్నారు. 

తాజాగా మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ స‌చిన్ టెండూల్క‌ర్‌ కూడా ఆఫ్ఘ‌నిస్థాన్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తాడు. ఇది ఆఫ్ఘాన్‌కు అనుకోకుండా ద‌క్కిన విజ‌యం కాద‌ని, వారు అల‌వాటు చేసుకున్న విజయమని ఆ జ‌ట్టును కొనియాడాడు. ఈ మేర‌కు స‌చిన్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్ట్ పెట్టాడు.  

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఆ జ‌ట్టు ఎదుగుతున్న తీరు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని పేర్కొన్నాడు. వారు అనుకోకుండా గెలిచార‌ని ఇక‌పై ఎవ‌రూ భావించొద్ద‌న్నాడు. ఆఫ్ఘన్ కుర్రాళ్లు గెలుపుల‌ను అల‌వాటుగా మార్చుకున్నార‌ని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో భారీ సెంచ‌రీ చేసిన ఇబ్ర‌హీం జ‌ద్రాన్‌, 5 వికెట్లతో స‌త్తా చాటిన ఒమ‌ర్జాయ్‌ని ఆయన ప్ర‌త్యేకంగా అభినందించాడు. ఆఫ్ఘనిస్థాన్‌కు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించార‌ని, బాగా ఆడారంటూ స‌చిన్ మెచ్చుకున్నాడు. 
Go Back to Shorts
Sachin Tendulkar
Afghanistan
England
Champions Trophy 2025
Cricket
Sports News

More Telugu News