జైల్లో పెడతామని బెదిరిస్తున్నా రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం: కేటీఆర్
- పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
- ముగ్గురు మంత్రులు కలిసి ఖమ్మం జిల్లాలో ఏకగ్రీవానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణ
- బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటోందన్న కేటీఆర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకొని ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వారి కుట్రల్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని అన్నారు. ఖమ్మం జిల్లాలో 2014 తర్వాత బీఆర్ఎస్ ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. పువ్వాడ అజయ్ వంటి నాయకులు ఓడిపోవడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక రాజకీయ సమీకరణాల కారణంగా పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటోందన్నారు. ఖమ్మంలో ఇటీవల వరదలు వస్తే అందరికీ పువ్వాడ అజయ్ గుర్తుకువచ్చాడన్నారు. వరదల సమయంలో జిల్లా మంత్రుల వల్ల పైసా ఉపయోగం కనిపించలేదని విమర్శించారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకపోవడంతో ఎంతో నష్టపోయామనే అభిప్రాయంతో తెలంగాణ ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. త్వరలో తాను ఖమ్మంలో పర్యటిస్తానని కేటీఆర్ అన్నారు.