Hermès Birkin: గాజా ప్రజలు ఆకలితో చచ్చిపోతుంటే.. సిన్వర్ భార్య చేతిలో రూ. 27 లక్షల హ్యాండ్‌బ్యాగ్.. వీడియో ఇదిగో!

Yahya Sinwars wife made headlines all over the world with these cuase
  • బంకర్‌లోకి వెళ్తూ హెర్మెస్ బ్రాండ్ బిర్కిన్‌తో కనిపించిన హమాస్ చీఫ్ సిన్వర్ భార్య
  • దాని ఖరీదు రూ. 27 లక్షలు
  • వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం
  • ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన బ్యాగ్ ధర
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పారిస్‌కు చెందిన లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్ తయారీ సంస్థ ‘హెర్మెస్’ పేరు మరోమారు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కారణం.. ఇటీవల ఇజ్రాయెల్ చేతిలో హతమైన హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ భార్య ఆ హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించడమే. ఇజ్రాయెల్ దాడితో గాజా అతలాకుతలమై తిండి, నీళ్లు దొరక్క ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న వేళ 32 వేల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 27 లక్షలు) బ్యాగుతో కనిపించి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు.

హెర్మెస్ హ్యాండ్‌బ్యాగ్‌లను సాధారణంగా హాలీవుడ్ హీరోయిన్లు ఉపయోగిస్తుంటారు. కిమ్ కర్దాషియన్ మొదలు ఎంతోమంది ఈ బ్యాగులపై మనసు పారేసుకుంటారు. అలాంటి బ్యాగు ఇప్పుడు సిన్వర్ భార్య అబు జామెర్ చేతిలో ఇటీవల కనిపించింది. ఇజ్రాయెల్ నుంచి తమకు ప్రమాదం పొంచి ఉందని భావించిన సిన్వర్ కుటుంబంతో కలిసి బంకర్‌లోకి వెళ్తున్న సమయంలో జామెర్ చేతిలో ఈ బ్యాగ్ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ బ్యాగుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

గాజా ప్రజలు చేతిలో చిల్లిగవ్వ లేక, తినడానికి తిండి లేక ఈ పూట గడిస్తే చాలన్న భావనలో క్షణమొక యుగంగా బతుకుతున్నారు. అలాంటి సమయంలో అబు జామెర్ చేతిలో కనిపించిన ఈ ఖరీదైన బిర్కిన్ బ్యాగ్ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత సిన్వర్ భార్య లగ్జరీ లైఫ్‌పై చర్చ మొదలైంది.

గాజా ప్రజలు డబ్బు, తిండి లేకుండా బాధపడుతుంటే సిన్వర్, ఆయన భార్యకు డబ్బంటే ఎంత ప్రేమో ఈ బ్యాగ్ రుజువు చేస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు పుష్కలంగా ఉన్నప్పటికీ చాలామంది ఈ బ్యాగు కొనేందుకు వెనకాడతారని మరొకరు రాసుకొచ్చారు. అసలు హెర్మెస్ బొటిక్ వైపు చూడాలంటేనే చాలామంది భయపడతారని మరికొందరు పేర్కొన్నారు.  

 హెర్మెస్‌ బ్రాండ్‌ను 1837లోనే స్థాపించారు. లెదర్ వస్తువులు, లైఫ్‌స్టైల్ యాక్ససరీస్‌కు ఈ ఫ్రెంచ్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ ప్రపంచంలోనే పేరెన్నికగన్నది. బిర్కిన్ బ్యాగ్‌ను మాత్రం 1984లో తీసుకొచ్చారు. ఈ ఫ్యాషన్ హౌస్‌లో విక్రయించే హ్యాండ్ బ్యాగ్ కనీస ధర రూ. 8 లక్షలు కాగా, రూ. 4 కోట్ల వరకు బ్యాగులు ఇక్కడ లభ్యమవుతాయి. 
Hermès Birkin
Yahya Sinwar
Hamas
Samr Abu Zamer
Israel

More Telugu News