Father Suicide: దుర్గమ్మ నిమజ్జనానికి వెళుతున్నానంటూ ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన తండ్రి.. ముగ్గురూ మృతి

Father Suicide with two Sons in kamareddy
షార్ట్స్‌లో చూడండి
దసరా పండుగ పూట కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో విషాదం చోటుచేసుకుంది. దుర్గమ్మ నిమజ్జనం చూసి వస్తామంటూ ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్లిన తండ్రి బావిలో శవంగా తేలాడు. ముక్కుపచ్చలారని పిల్లలు కూడా విగత జీవులుగా మారిపోయారు. గ్రామ శివార్లలోని బావిలో పిల్లల మృతదేహాలు తేలడం గుర్తించి తండ్రి కోసం వెతకగా.. నీటి అడుగున మృతదేహం బయటపడింది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో శనివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మృతదేహాలు బయటపడ్డాయి.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయిగావ్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి నందివాడకు చెందిన అపర్ణను వివాహం చేసుకుని ఇల్లరికం వచ్చాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేశ్ (6), అనిరుధ్‌ (4). నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో శనివారం రాత్రి దుర్గమ్మ నిమజ్జనానికి వెళ్లి వస్తామంటూ ఇద్దరు కొడుకులను తీసుకుని శ్రీనివాస్ రెడ్డి వెళ్లాడు. సాయంత్రం 7:30 గంటలకు వెళ్లిన వ్యక్తి రాత్రి పది గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో అపర్ణ భర్తకు ఫోన్ చేసింది. అయితే, శ్రీనివాస్ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన అపర్ణ తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఆదివారం ఉదయం గ్రామ శివార్లలోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు తేలాయి. శ్రీనివాస్ రెడ్డి చెప్పులు, మొబైల్ ఫోన్ బావి ఒడ్డున కనిపించాయి. అయితే ఆయన ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో పిల్లల మృతదేహాలను బయటకు తీసి బావిలోని నీటిని మోటారు సాయంతో తోడించగా.. నీటి అడుగున శ్రీనివాస్‌రెడ్డి మృతదేహం బయటపడింది. తండ్రీకొడుకులు బలవన్మరణంతో నందివాడలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు కారణం కుటుంబ కలహాలేనని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Go Back to Shorts
Father Suicide
Two Kids
Kamareddy District
nandiwada

More Telugu News