కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణగా చూపించి... అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక
- అధికారులు జీవితంలో ఏ తప్పు చేయకూడదో కాళేశ్వరం ఉదాహరణ అన్న సీఎం
- నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని వ్యాఖ్య
- నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నాళ్లు నిలబడకపోయేవన్న సీఎం
- కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందన్న ముఖ్యమంత్రి
నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవన్నారు. నాణ్యత లేకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులు ఇన్నేళ్లు నిలబడేవి కావన్నారు. పైఅధికారులు చెప్పారని నాణ్యత, నిబద్ధత విషయంలో రాజీపడవద్దని సూచించారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నాయన్నారు. కానీ ఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందన్నారు.
నిర్మాణం పూర్తికాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచ అద్భుతంగా గత పాలకులు అభివర్ణించారని మండిపడ్డారు. కాళేశ్వరం విషయంలో ఎవరిని బాధ్యులను చేయాలి? క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు సమర్థవంతంగా పని చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. నిర్మాణ సామగ్రి నాణ్యత కూడినది కాదని ఇంజినీర్లు వెనక్కి పంపిస్తే కూలిపోయే పరిస్థితి వచ్చేది కాదన్నారు.