రేవంత్ రెడ్డి ఎంత గగ్గోలు పెట్టినా నా అంత ఎత్తుకు ఎదగలేరు: హరీశ్ రావు
- రేవంత్ మాట్లాడేవన్నీ అబద్ధాలేనన్న హరీశ్ రావు
- నేను ఎక్కడా దాక్కోలేదు... నీ గుండెల్లోనే ఉన్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు
- రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని సవాల్
ఎక్కడ దాక్కున్నావంటూ రేవంత్ మాట్లాడుతున్నారు... నేను ఎక్కడా దాక్కోలేదు, నీ గుండెల్లోనే ఉన్నా... రుణమాఫీపై నిన్ను అడుగడుగునా నిలదీస్తుంటా అని హరీశ్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. మీ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించాం... మొత్తం రుణమాఫీ పూర్తయ్యే వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు అని స్పష్టం చేశారు.
సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ జరిగిందా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. 100 రోజుల్లో రుణమాఫీ అమలు చేస్తామన్నారు... రుణమాఫీపై చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి, అంతా బోగస్ చేశారు, అన్ని విధాలుగా రైతులను మోసం చేశారు అని విమర్శించారు.