నర్సాపురం ఎంపీడీవో వెంకటరమణ కథ విషాదాంతం.. ఏలూరు కాల్వలో లభ్యమైన మృతదేహం
- ఈ నెల 15న అదృశ్యమైన వెంకటరమణారావు
- పుట్టిన రోజే చనిపోయిన రోజంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్
- వారం రోజులుగా గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- మధురానగర్ పై వంతెన పిల్లర్‌కు చిక్కుకున్న మృతదేహం
విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురంలో ఉండే వెంకటరమణారావు నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు సెలవు పెట్టిన ఆయన కానూరు వచ్చారు. 15న పని ఉందని, మచిలీపట్టణం వెళ్లారు. అర్ధరాత్రి తాను చనిపోతున్నానని, అందరూ జాగ్రత్త అని మెసేజ్ పెట్టి సెల్ ఆఫ్ చేశారు.
ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు మచిలీపట్టణం, విజయవాడలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన వాహనం మచిలీపట్టణం రైల్వే స్టేషన్‌లో ఉన్నట్టు గుర్తించారు. వెంకటరమణారావు కనిపించకుండా పోవడానికి మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ. 54 లక్షల బకాయిలు ఉండడమే కారణమని గుర్తించారు.