Jagan: ఏం జరిగిందో తెలియడం లేదు... కానీ...!: సీఎం జగన్

CM Jagan press meet after disastrous loss in AP Elections
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో అధికార వైసీపీ ఊహించని రీతిలో దారుణ పరాజయం పాలవడం పట్ల ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సాయంత్రం ఆయన తాడేపల్లి నుంచి మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ మంచి చేసినా ఓటమిపాలయ్యామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు తీసుకువచ్చాం... 1.05 కోట్ల మందికి సంక్షేమాన్ని అందించాం... పిల్లలు బాగుండాలని వారి అభ్యున్నతి కోసం అడుగులు వేశాం, విద్యా వ్యవస్థలో ఎన్నడూ చూడని మార్పులు తెచ్చాం... వితంతువులకు, వికలాంగులకు, అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చాం... ఇచ్చిన ఏ మాట తప్పకుండా మంచి చేశాం... ఆ చేసిన మంచి ఏమైపోయిందో, ప్రజల ప్రేమ ఏమైపోయిందో అర్థంకావడంలేదని బాధను వెలిబుచ్చారు.  

సమయానికి రైతు భరోసా ఇచ్చాం... 54 లక్షల మంది రైతులకు అండగా నిలిచాం... మరి ఆ రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు అని ఆక్రోశించారు. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు అని వాపోయారు.

"నా ప్రతి కష్టంలో కూడా తోడుగా, అండగా నిలబడిన ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి వాలంటీరుకు, ప్రతి ఇంట్లోంచి వచ్చిన నా స్టార్ క్యాంపెయినర్ అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 

ఏం జరిగిందో తెలియదు కానీ... ఏం చేసినా, ఎంత చేసినా మా 40 శాతం ఓటు బ్యాంకును మాత్రం తగ్గించలేకపోయారు. ఈ స్థితి నుంచి కచ్చితంగా పైకి లేస్తాం. గుండె ధైర్యంతో ముందుకు సాగుతాం. మాకేమీ ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు... పోరాటాలు చేయడం అంతకన్నా కొత్త కాదు. 

ఈ ఐదేళ్లు తప్ప నా రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలో గడిపాను. పోరాటాలు చేశాను... రాజకీయ జీవితంలో ఎవరూ చూడని కష్టాలు కూడా అనుభవించాను. అంతకుమించిన కష్టాలు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్లకు ఆల్ ది బెస్ట్. చంద్రబాబుకు, పవన్ కల్యాణ్ కు అభినందనలు" అంటూ సీఎం జగన్ పేర్కొన్నారు.
Go Back to Shorts
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News