ఆన్ లైన్ మోసం నుంచి ఇలా బయటపడ్డా.. నెటిజన్లతో అనుభవాన్ని పంచుకున్న మహిళ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆన్ లైన్ మోసం నుంచి ఇలా బయటపడ్డా.. నెటిజన్లతో అనుభవాన్ని పంచుకున్న మహిళ

Bengaluru Woman Exposes Money Swiping Scam Via Bank Screenshots
  • బ్యాంకు ఖాతాకు బాకీ డబ్బు పంపుతున్నట్లు కేటుగాడి ఫోన్
  • నకిలీ మెసేజ్ పంపిన వైనం.. పొరపాటున ఎక్కువ మొత్తం పంపానని వెల్లడి
  • దాన్ని తిరిగి తనకు పంపాలని విజ్ఞప్తి 
  • బ్యాంక్ పేరు బదులు 10 అంకెల నంబర్ నుంచి మెసేజ్ వచ్చినట్లు గుర్తించిన మహిళ
  • ఫోన్ కట్ చేయడంతో తప్పిన మోసం
దేశంలో రోజురోజుకూ డిజిటల్ లావాదేవీలు పెరుగుతుండటంతో ఆన్ లైన్ మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతున్నారు.  బెంగళూరుకు చెందిన అదితి చోప్రా అనే మహిళ ఈ తరహా మోసాన్ని బట్టబయలు చేసింది. డబ్బు కొట్టేసేందుకు కేటుగాళ్లు వేసిన ప్లాన్ నుంచి తాను ఎలా బయటపడ్డానో తాజాగా నెటిజన్లతో పంచుకుంది. బ్యాంకు అకౌంట్ లోకి డబ్బు క్రెడిట్ చేసినట్లు మోసగాళ్లు తన ఫోన్ కు పంపిన ఫేక్ మెసేజ్ లను ‘ఎక్స్’లో షేర్ చేసింది. అలాగే ఒక సుదీర్ఘ పోస్ట్ ను పెట్టింది.

‘బెంగళూరులోని ఆఫీసులో పనిచేస్తుండగా ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ పెద్దాయన గొంతుతో నాకొకడు ఫోన్ చేశాడు. నన్ను పేరు పెట్టి మరీ పిలిచాడు. మా నాన్నకు ఇవ్వాల్సిన డబ్బును ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేయాల్సి ఉందని.. కానీ ఆయన నా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయమన్నారని చెప్పాడు. ఆ వెంటనే నా ఖాతాలోకి రూ. 10 వేలు, రూ. 30 వేలు క్రెడిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. కానీ అంతలోనే పొరపాటు జరిగిందని.. రూ. 3 వేలు పంపే బదులు ఒక సున్నా ఎక్కువ నొక్కేశానని.. అందుకే రూ. 30 వేలు క్రెడిట్ అయ్యిందని చెప్పాడు. అదనంగా పంపిన డబ్బును తిరిగి పంపాలని కోరాడు. కానీ నేను తీక్షణంగా ఎస్ఎంఎస్ లను పరిశీలించగా అవి బ్యాంకు నుంచి వచ్చినట్లు కనిపించలేదు. ఒక 10 అంకెల నంబర్ నుంచి వచ్చినట్లు గుర్తించా. మెసేజ్ ల పక్కన ఎర్ర జెండాల బొమ్మ కనిపించడంతో నా అనుమానం మరింత బలపడింది. దీంతో ఫోన్ కట్ చేశా. నా బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకున్నాక ఆ నంబర్ కు తిరిగి కాల్ చేసేందుకు ప్రయత్నిస్తే నా నంబర్ ను బ్లాక్ చేశారు’ అని అదితి చోప్రా తన పోస్ట్ లో పేర్కొంది.

సాధారణంగా ఎవరికైనా అలాంటి ఫోన్ కాల్ రాగానే వెంటనే డబ్బు వెనక్కి పంపించేస్తారని ఆమె చెప్పింది. కానీ తన తండ్రి ఎప్పుడూ డబ్బు విషయంలో ఒకటికి మూడుసార్లు సరిచూసుకోవాలని చెబుతుంటారని.. అదే తనను మోసగాళ్ల బారి నుంచి కాపాడిందని తెలిపింది. 

‘మీకు వచ్చే ఎస్ ఎంఎస్ లను దయచేసి చదువుకోండి. ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చే మెసేజ్ లను నమ్మకండి’ అంటూ పోస్ట్ చేసింది. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ‘ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు మీ బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్ ను వేరే ఫోన్ లో చెక్ చేసుకోండి. ఎస్ ఎంఎస్ లను చూసి నిర్ణయాలు తీసుకోకండి’ అని ఆమె చెప్పింది.
Advertisement
online money scam
bengaluru woman
exposed
social media

More Telugu News