తన పేరుతో ఉన్న జెర్సీని ధరించిన వ్యక్తిని సర్ ప్రైజ్ చేసిన సచిన్... వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన పేరుతో ఉన్న జెర్సీని ధరించిన వ్యక్తిని సర్ ప్రైజ్ చేసిన సచిన్... వీడియో ఇదిగో!

Sachin Tendulakar surprises ardent fan
  • ఎక్స్ లో ఓ ఆసక్తికర వీడియో పంచుకున్న సచిన్
  • టెండూల్కర్ అనే పేరున్న జెర్సీ ధరించిన వ్యక్తి
  • కారు ఆపి అతడ్ని పలకరించిన సచిన్
  • వీడియో వైరల్
సచిన్ టెండూల్కర్... ఈ పేరు భారత క్రికెట్ ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతుంది. క్రికెట్ ప్రపంచంలో మహోన్నతుడు అనే స్థాయికి చేరిన అతి కొద్ది మంది క్రికెటర్లలో సచిన్ ఒకడు. భారత్ లో క్రికెట్ ఒక మతం అయితే... సచిన్ ఒక దేవుడు!

2013లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన సచిన్... ఇప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉన్నాడు. తాజాగా, ఎక్స్ ద్వారా ఒక ఆసక్తికర వీడియోను పంచుకున్నాడు. 'సచిన్ ఇవాళ టెండూల్కర్ ను కలిశాడు' అంటూ తన పోస్టుకు హెడ్డింగ్ పెట్టారు. 

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే... సచిన్ కారులో వెళుతుండగా, టెండూల్కర్ అనే పేరుతో ఉన్న నెం.10 ముంబయి ఇండియన్స్ జెర్సీని ధరించి ఓ వ్యక్తి బైక్ పై అదే రూట్లో వెళ్లడం చూడొచ్చు. అతడిని గమనించిన సచిన్... తన కారును నిలిపి ఆ బైకర్ ను కూడా ఆపాడు. అప్పుడా వ్యక్తి ముఖంలో కనిపించిన ఫీలింగ్ మాటలకు అందదు. 

తన ఆరాధ్య దైవం కళ్లెదుట ప్రత్యక్షమైతే ఏ భక్తుడికి మాత్రం మాటలు వస్తాయి! వెంటనే ఆ వ్యక్తి రెండు చేతులు జోడించి సచిన్ కు నమస్కరించాడు. అంతేకాదు, తన చేతిపై ఉన్న పచ్చ బొట్టును, తన బైక్ కవర్ లో ఉన్న సచిన్ ఫొటోలతో కూడిన బుక్ ను చూపించడంతో సచిన్ సంబరపడిపోయాడు. ఆ బుక్ లో ఆటోగ్రాఫ్ చేసి తన వీరాభిమానిని సంతోషపెట్టాడు. 

దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్ లో పోస్టు చేసిన సచిన్... "నాపై ఆ అభిమాని చూపిన అపారమైన ప్రేమతో నా హృదయం సంతోషంతో నిండిపోయింది. జీవితంలో ఊహించని కోణాల్లోనూ ఇలా వ్యక్తుల నుంచి ప్రేమ లభిస్తుండడం జీవితాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చివేస్తుంది" అని పేర్కొన్నారు.
Advertisement
Sachin Tendulkar
Fan
Biker
Video
Cricket

More Telugu News