వైఎస్సార్ బిడ్డనైన నేను వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా పోతానా?: వైసీపీ శ్రేణులపై షర్మిల ఫైర్
- ఏపీలో దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తున్నారన్న షర్మిల
- స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న పార్టీలకు ఓటు వేయవద్దని పిలుపు
- పాదయాత్ర చేస్తానని భారతిని అడిగినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
అందరం ప్రమాణం చేద్దాం..
దళితుల కోసం కేటాయించిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టిస్తున్నారని షర్మిల విమర్శించారు. ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు, ఇతర సామాజికవర్గాలకు చెందిన అందరూ బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పారు. దళితులపై కపట ప్రేమను చూపిస్తున్న వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరం ప్రమాణం చేద్దామని... రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వని పార్టీలకు మద్దతు తెలపబోమని ప్రమాణం చేయాలని చెప్పారు. స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పార్టీలకు ఓటు వేయబోమని ప్రమాణం చేద్దామని అన్నారు.
నా కుమారుడికి వైఎస్సార్ ఆయన తండ్రి పేరు పెట్టుకున్నారు..
తన గురించి తప్పుగా మాట్లాడుతున్న వైసీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. తాను వైఎస్సార్ కుమార్తెను అయినప్పుడు... ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తన కుమారుడికి తన తండ్రి రాజశేఖరరెడ్డి ఆయన తండ్రి పేరు వైఎస్ రాజారెడ్డి అని పెట్టుకున్నారని తెలిపారు. తనకు కితాబు ఇస్తే తన విలువ ఎక్కువ కాదని, ఎవరో కితాబు ఇవ్వకపోతే తన విలువ తక్కువ కాదని అన్నారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను సాధించేందుకే తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు.
నాపై అభాండాలు వేస్తే మీ విలువ పెరగదు..
సొంత మనిషిగా భావించిన కొండా రాఘవరెడ్డి కూడా అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. పాదయాత్ర చేస్తానని తాను భారతిని అడిగానని ఆయన అన్నారని... మీ దేవుడి మీద, మీ బిడ్డల మీద ప్రమాణం చేసి తాను అడిగానని చెప్పగలరా? అని ప్రశ్నించారు. నిజాలు మాట్లాడితే మీ విలువ పెరుగుతుంది కానీ, ఇలాంటి అభాండాలు వేస్తే మీ విలువ పెరగదని అన్నారు. అక్రమంగా సంపాదించుకోవడానికి తన భర్తతో కలిసి జగన్ వద్దకు వెళ్లానని అంటున్నారని... ఈరోజు వరకు ఏదీ ఆశించి తన అన్న వద్దకు వెళ్లలేదని చెప్పారు. దానికి సాక్ష్యం తన తల్లి అని... దమ్ముంటే వెళ్లి ఆమెను అడగాలని అన్నారు.