Team India: మార్ క్రమ్ సెంచరీ... బుమ్రాకు 6 వికెట్లు... టీమిండియా టార్గెట్ 79 రన్స్

కేప్ టౌన్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా... టీమిండియా ముందు 79 పరుగుల విజయలక్ష్యాన్నుంచింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఈ లక్ష్యం ఆడుతూ పాడుతూ కొట్టేస్తారు. కానీ, ఇక్కడి న్యూలాండ్స్ స్టేడియం పిచ్ పేసర్లకు వికెట్ల పంట పండిస్తోంది. దాంతో, టీమిండియా ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందా, లేక చతికిలపడుతుందా? అంటూ అభిమానుల్లో ఒకింత ఆందోళన కలుగుతోంది. 

కాగా, ఓవర్ నైట్ స్కోరు 63/3 తో నేడు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 36.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. మిగతా బ్యాటర్లు నిప్పుల కుంపటిలా భావించిన ఈ పిచ్ పై సఫారీ ఓపెనర్ ఐడెన్ మార్ క్రమ్ సెంచరీ సాధించడం వేరే లెవెల్ ఆట అని చెప్పవచ్చు. వీరోచితంగా ఆడిన మార్ క్రమ్ 103 బంతుల్లో 17 ఫోర్లు, 2 సిక్సర్లతో 106 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

ఓవైపు వికెట్లు రాలిపోతున్నా, మార్ క్రమ్ ఒంటరిపోరాటం చేశాడు. అతడి వల్లే దక్షిణాఫ్రికా జట్టు టీమిండియాకు లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. లేకపోతే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. 

టీమిండియా బౌలర్లలో బుమ్రా అద్భుతంగా రాణించి 6 వికెట్లు పడగొట్టడం ఇవాళ్టి ఆటలో మరో హైలైట్. ముఖేశ్ కుమార్ కు 2, ప్రసిద్ధ్ కృష్ణకు 1, సిరాజ్ కు 1 వికెట్ లభించాయి. ఈ టెస్టుకు ఇవాళ రెండో రోజు కాగా... కాసేపట్లో ఫలితం తేలే అవకాశాలున్నాయి. 

ఈ టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలింది. అనంతరం, టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులు చేసింది.
Team India
Aiden Markrum
South Africa
Bumrah
Cape Town
2nd Test

More Telugu News