తెలంగాణ అప్పు రూ.6,71,757 కోట్లు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
- 2014లో రూ.72,658 కోట్ల అప్పులో ఉన్న రాష్ట్రం
- అప్పట్లో ఖజానాలో వంద రోజులకు సరిపడా సొమ్ము
- ప్రస్తుతం రోజు ఖర్చులకూ ఆర్బీఐపై ఆధారపడాల్సి వస్తోంది
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన డిప్యూటీ సీఎం
గత ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కు, వాస్తవ వ్యయానికి 20 శాతం తేడా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బడ్జెటేతర ఖర్చు విపరీతంగా పెరిగిందని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలలో సరిపడా నిధులను ఖర్చు చేయలేదని చెప్పారు. ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని వివరించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో వడ్డీ ( తీసుకున్న రుణాలకు) భారం 34 శాతానికి పెరిగిందని తెలిపారు. మరో 35 శాతం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. 2014లో మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రం ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి బడ్జెటేతర రుణాలే కారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు.