ICC: ఐసీసీ కొత్త రూల్... మైదానంలో టైమ్ వేస్ట్ చేయడం ఇక కుదరదు!

ICC brings new rule to control time waste between overs by fielding side
షార్ట్స్‌లో చూడండి
క్రికెట్ మ్యాచ్ లో ఓవర్ పూర్తయ్యాక మళ్లీ ఓవర్ వేసేందుకు కొంత వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధిలో కెప్టెన్లు ఫీల్డింగ్ మోహరింపులు చేస్తుంటారు. దాంతో కొంత సమయం వృథా అవుతుంటుంది. దీన్ని అరికట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త రూల్ తీసుకువస్తోంది. 

ఈ రూల్ ప్రకారం ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్ల లోపు కొత్త ఓవర్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ రూల్ అమలు చేసేందుకు ఓ ఎలక్ట్రానిక్ క్లాక్ ను స్టేడియంలో ఏర్పాటు చేస్తారు. ఇది 60 నుంచి 0 వరకు కౌంట్ డౌన్ చేస్తుంది. ఫీల్డింగ్ జట్లు నిర్ణీత సమయంలోపు కొత్త ఓవర్ లో తొలి బంతిని విసరలేకపోతే ఆ జట్టుకు రెండు హెచ్చరికలు జారీ చేస్తారు. తద్వారా ఐదు పరుగుల జరిమానా విధించే వీలుంటుంది. 

అయితే, వికెట్  పడినప్పుడు మైదానంలోకి కొత్త బ్యాట్స్ మన్ వచ్చిన సమయంలో ఈ నిబంధన వర్తించదు. డ్రింక్స్ సమయంలోనూ, గాయపడిన ఆటగాడు మైదానంలో చికిత్స పొందేందుకు అంపైర్లు అనుమతించినప్పుడు, ఫీల్డింగ్ జట్టుకు సంబంధించని కారణాలతో సమయం వృథా అయినప్పుడు కూడా ఈ నిబంధన వర్తించదు. 

41.9 నిబంధన కింద ఈ కొత్త రూల్ తెచ్చేందుకు ఐసీసీ కసరత్తులు చేస్తోంది. తొలుత దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ డిసెంబరు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు జరిగే దాదాపు 59 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఈ కొత్త రూల్ ను అమలు చేసి పరిశీలిస్తారు. డిసెంబరు 12న వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగే తొలి టీ20 ద్వారా ఈ నూతన నిబంధన తీసుకురానున్నారు.
Go Back to Shorts
ICC
New Rule
Time Waste
Fielding Side
International Cricket

More Telugu News