సెమీఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా.. రసవత్తరంగా మారిన నాలుగవ స్థానం.. 3 జట్ల మధ్య పోటీ
- న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌కు సమాన అవకాశాలు
- లీగ్ దశలో చివరి మ్యాచ్ ఫలితాల ఆధారంగా ఖరారు కానున్న చివరి సెమీస్ బెర్త్
- అనూహ్యంగా మూడు జట్లూ గెలిచినా, ఓడినా కీలకం కానున్న నెట్ రన్‌రేట్
పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ మూడు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడి నాలుగు చొప్పున గెలుపులతో సమానమైన పాయింట్లతో ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా న్యూజిలాండ్ 4వ స్థానంలో, పాకిస్థాన్ 5వ ప్లేస్, ఆఫ్ఘనిస్థాన్ 6వ స్థానాల్లో ఉన్నాయి. గ్రూపు దశలో ఈ మూడు ఒక్కొక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. సాధించే విజయాన్ని బట్టి 3 జట్లకూ సెమీఫైనల్ అవకాశం ఉంది. ఒకవేళ మూడు జట్లూ తమ చివరి మ్యాచ్‌లలో గెలిస్తే 10 పాయింట్లతో మళ్లీ సమానంగానే ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీ ఫైనల్ చేరుకునే జట్టుని నిర్ణయిస్తారు. ప్రస్తుతానికైతే న్యూజిలాండ్ మెరుగైన రన్‌రేటుతో కనిపిస్తోంది. అనూహ్యంగా 3 జట్లూ తమ చివరి మ్యాచ్‌లో ఓడినా నెట్ రన్‌రేట్ కీలకం కానుంది.
ఇదిలావుండగా ప్రస్తుతం భారత్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. 12 పాయింట్లతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో, 12 పాయింట్లతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో ఉన్నాయి. ఈ మూడు జట్లు సెమీఫైనల్‌కి అర్హత సాధించాయి.