కేరళలో పెరుగుతున్న నిపా వైరస్ కేసులు.. కంటైన్ మెంట్ జోన్ లో ఏడు గ్రామాలు
Add ap7am to your home Screen

కేరళలో పెరుగుతున్న నిపా వైరస్ కేసులు.. కంటైన్ మెంట్ జోన్ లో ఏడు గ్రామాలు

Nipah virus Cases increasing in Kerala
  • ఇళ్లల్లో నుంచి బయటికి రావద్దంటూ గ్రామస్థులకు ఆంక్షలు
  • రాష్ట్రంలో వైరస్ బారిన పడి ఇప్పటికే ఇద్దరి మృతి
  • బాధితుల కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాజిటివ్
  • కోజికోడ్ లో తాజాగా మరో కేసు గుర్తింపు  
కేరళలో నిపా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రెండు కేసులు గుర్తించగా.. తాజాగా కోజికోడ్ జిల్లాలో మరో వ్యక్తికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోవడం, బాధితుల కుటుంబ సభ్యుల్లో ఇద్దరికి పాజిటివ్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితుల సొంతూళ్లతో పాటు చుట్టుపక్కల ఏడు గ్రామాలను కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించింది. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ఆయా గ్రామాల ప్రజలకు సూచించింది. గ్రామాల్లో ఆంక్షలు విధించింది. బడులు, ప్రభుత్వ కార్యాలయాలను అధికారులు మూసివేయించారు.

కోజికోడ్ లో మరో వ్యక్తికి సోకిన వైరస్..
కోజికోడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉద్యోగికి వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ నిర్ధారించారు. రాష్ట్రంలో బుధవారం వరకు మొత్తం ఐదు కేసులు గుర్తించినట్లు వివరించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, వైరస్ బాధితులను కాంటాక్ట్ లిస్టులో ఉన్న 706 మందిని గుర్తించామని చెప్పారు. వారిలో హైరిస్క్ కేటగిరీలో ఉన్న 77 మందిని వారి వారి ఇళ్లల్లోనే ఐసోలేషన్ లో ఉంచి పరీక్షిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 19 కమిటీలను ఏర్పాటు చేసి ఈ చర్యలను సమన్వయం చేసుకుంటున్నామని, ఐసోలేషన్ లో ఉన్న వారికి నిత్యావసరాలు అందించేందుకు వాలంటీర్ల బృందాలను కూడా ఏర్పాటు చేశామని మంత్రి వీణా జార్జ్ వివరించారు.

జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచన..
నిపా వైరస్ గబ్బిలాలు, పందుల ద్వారా మనుషులకు సోకుతుందని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వ్యాప్తి తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య ఎక్కువని చెబుతూనే ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. అయితే, జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Advertisement
Nipah
virus case
Kozhikode
Kerala
minister vina george

More Telugu News