Sejal: నిద్రమాత్రలు మింగి మరోసారి ఆత్మహత్యాయత్నం చేసిన ఆరిజిన్ డెయిరీ ఎండీ శేజల్!

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై గతంలో ఆరోపణలు చేసిన శేజల్
  • అప్పట్లో ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఆత్మహత్యాయత్నం
  • తాజాగా హైదరాబాదు పెద్దమ్మ గుడి వద్ద అపస్మారక స్థితిలో శేజల్
  • బ్యాగులో నిద్రమాత్రలు!
Sejal once again attempt to commit suicide

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆరిజిన్ డెయిరీ ఎండీ శేజల్ గతంలో ఓసారి ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆత్మహత్యకు యత్నించడం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె మరోసారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. 

హైదరాబాద్ లోని పెద్దమ్మ గుడి వద్ద రహదారిపై శేజల్ అపస్మారకస్థితిలో ఉండగా గుర్తించారు. ఇవాళ ఏకాదశి పండుగ కావడంతో శేజల్ పెద్దమ్మ గుడికి వచ్చినట్టు భావిస్తున్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఇంకా చర్యలు తీసుకోలేదని, తనకు న్యాయం జరగలేదని శేజల్ మనస్తాపం చెందినట్టుగా భావిస్తున్నారు. ఆమె వద్ద లభించిన హ్యాండ్ బ్యాగులో నిద్రమాత్రలు కనిపించాయి. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేసినట్టు తెలిసింది. 

కాగా, అపస్మారక స్థితిలో ఉన్న శేజల్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. శేజల్... ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై సీబీఐ, మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు!

ఘటన స్థలం వద్ద పోలీసులు సూసైడ్ నోట్ ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. తనకు ఎక్కడా న్యాయం జరగలేదని, పెద్దమ్మ తల్లి అయినా తనకు న్యాయం చేయాలని ఆ లేఖలో ఉంది. 

ఢిల్లీలో సీఎం కేసీఆర్ నివాసం వద్ద గతంలో నిరసన తెలిపిన సమయంలో మంత్రి కేటీఆర్ తనతో మాట్లాడారని, ఆ సమయంలో అక్కడ ముగ్గురు బీఆర్ఎస్ పెద్దలు కూడా ఉన్నారని, దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొంది. తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేతకు హామీ ఇచ్చారని లేఖలో వెల్లడించింది. 

దుర్గం చిన్నయ్య బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, పైగా తన ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని వివరించింది. ఇలాంటి పరిస్థితుల్లో తప్పక చంపేస్తారని భావిస్తున్నానని, ఇక న్యాయం జరగదన్న నిర్ణయానికి వచ్చి తాజాగా ఆత్మహత్యకు పాల్పడుతున్నానని ఆ సూసైడ్ నోట్ లో ఉన్నట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News