USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థి దుర్మరణం

Telugu student from Telangana dies in road accident in usa
షార్ట్స్‌లో చూడండి
పైచదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడిని అకాలమృత్యువు కబళించింది. అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం కప్పెటకు చెందిన బోయ వెంకట్రాములు, శకుంతల దంపతులకు ఇద్దరు సంతానం. బీటెక్ పూర్తి చేసిన పెద్ద కుమారుడు మహేశ్(25) ఎంఎస్ చదివేందుకు గతేడాది డిసెంబర్‌లో అమెరికాలోని మిన్నెసొటా రాష్ట్రానికి వెళ్లాడు. 

మంగళవారం రాత్రి అతడు తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోని అతడి ముగ్గురు స్నేహితులు గాయాలతో బయటపడ్డారు. మహేశ్ ఇక లేడన్న విషయాన్ని అతడి స్నేహితులు తండ్రి వెంకట్రాములుకు మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో చెప్పారు. 

మహేశ్ తండ్రి మహారాష్ట్రలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తాడనుకున్న కుమారుడు అకాల మరణం చెందటంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహేశ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అమెరికా తెలుగు సంఘం ఆటా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
USA

More Telugu News