CBI: దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కేసులో ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Setback for Opposition as SC rejects plea on misuse of central agencies
షార్ట్స్‌లో చూడండి
నేర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగపరుస్తోందంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన ప్రతిపక్షాలకు బుధవారం నిరాశ ఎదురైంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు కోరినట్టు మార్గదర్శకాలు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమైన సందర్భాన్ని తమ పిటిషన్ లో స్పష్టంగా పేర్కొనాలని ప్రతిపక్షాలకు సూచించింది. దుర్వినియోగాన్ని అడ్డుకోవడం పేరిట సాధారణ ఆదేశాలు ఇవ్వజాలమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ‘‘రాజకీయ నాయకులు చెబుతున్న గణాంకాల ఆధారంగా మార్గదర్శకాలను జారీ చేయలేము’’ అని స్పష్టం చేసింది.

ప్రతిపక్షాల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మార్చి 24న ఈ పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఏకంగా 14 ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావడం అసాధారణమని కోర్టు దృష్టికి తెచ్చారు. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన 95 శాతం కేసుల్లో నిందితులు ప్రతిపక్ష పార్టీల నేతలేనని తెలిపారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దర్యాప్తు సంస్థల కేసులు పెరిగిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో.. ప్రతిపక్షాలపై పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు ఏప్రిల్‌ 5న విచారణ చేపడతామని అప్పట్లో పేర్కొంది. 

అయితే..ప్రతిపక్షాలు కోరినట్టు మార్గదర్శకాలు జారీ చేయడం కుదరదని కోర్టు బుధవారం స్పష్టం చేసింది. ‘‘సీబీఐ, ఈడీ కేసుల వల్ల ప్రతిపక్ష నేతలపై ప్రతికూల ప్రభావం పడుతోందని రాజకీయ పార్టీలు వాదిస్తుంటే.. సమాధానం కూడా రాజకీయక్షేత్రంలోనే ఉంది. కోర్టులో కాదు’’ అని న్యాయస్థానం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో.. ప్రతిపక్షాలు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాయి.
Go Back to Shorts
CBI
ED
Supreme Court

More Telugu News