ముందు నాపై పూల వర్షం కురిపించారు... ఆ తర్వాత కోడిగుడ్లు విసిరారు: చిరంజీవి
- 'నిజం విత్ స్మిత' టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సింగర్ స్మిత
- మెగాస్టార్ చిరంజీవితో తొలి షో
- ఆసక్తిని పెంచుతున్న ప్రోమో
తాజాగా సింగర్ స్మిత సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'నిజం విత్ స్మిత' అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఆమె రెడీ అయింది. ఈ షోలో సినీ, రాజకీయ, పబ్లిక్ సర్వెంట్లు ఇలా ఎంతో మంది ప్రముఖుల జీవితాల్లోని ఆసక్తికర విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఆమె చేస్తోంది. తన టాక్ షోను మెగాస్టార్ చిరంజీవితో ఆమె ప్రారంభించబోతోంది. చిరుతో చేసిన షో ఈ నెల 10న విడుదల కాబోతోంది. ఈ షోకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాబోతున్నారు.
మరోవైపు చిరంజీవితో షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో చిరుకు స్మిత ఎన్నో ప్రశ్నలను సంధించింది. కాలేజ్ డేస్ లో మీ ఫస్ట్ క్రష్? స్టార్ డమ్ అనేది కొంతమందికే.. ఆ స్థాయికి వెళ్లాలంటే ఎన్నో అవమానాలు, అనుమానాలు ఉంటాయి. మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? వంటి ప్రశ్నలు చిరుకు ఎదురయ్యాయి. ఈ క్రమంలో, తన జీవితంలో ఎదుర్కొన్న ఒక ఘటనను చిరంజీవి చెప్పారు.
జగిత్యాలలో పర్యటించినప్పుడు తొలుత పైనుంచి తనపై పూలవర్షం కురిసిందని... ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే, కోడిగుడ్లతో కొట్టారని చెప్పారు. మళ్లీ ఒక వరప్రసాద్ మెగాస్టార్ అయ్యే పరిస్థితి ఈరోజు ఉందంటారా? అనే ప్రశ్నను స్మిత వేసింది. ఈ ప్రోమో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. పూర్తి ఎపిసోడ్ విడుదల కానున్న 10వ తేదీ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.