ముగింపు దశకు జోడో యాత్ర.. రేపు భారీ సభ
- 21 పార్టీలకు ఆహ్వానం పంపిన కాంగ్రెస్
- 12 పార్టీల నేతలే హాజరయ్యే అవకాశం
- 145 రోజులపాటు 3,970 కిలోమీటర్లు నడిచిన రాహుల్
ఈ సభకు 12 పార్టీల నేతలు హాజరు కానున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మొత్తం 21 పార్టీలను ఆహ్వానించామని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా 9 పార్టీల నేతలు రాకపోవచ్చని వెల్లడించాయి. డీఎంకే, ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన (ఉద్ధవ్ థాక్రే), సీపీఎం, సీపీఐ, వీసీకే, కేరళ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, జేఎంఎం పార్టీల లీడర్లు ముగింపు సభకు వస్తారని, టీఎంసీ, ఎస్పీ, టీడీపీ తదితర పార్టీల నేతలు రావట్లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్రను గతేడాది సెప్టెంబర్ 7న రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 145 రోజుల పాటు 3,970 కిలోమీటర్లు నడిచారు. రాహుల్ వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే కాదు.. వివిధ వర్గాల ప్రజలు, పార్టీల నేతలు నడిచారు.