చైనాలో కరోనా ఉగ్రరూపం.. కానీ, మన దగ్గర అదుపులోనే!
- చైనాలో నిత్యం లక్షలాది కొత్త కేసులు, భారీగా మరణాలు
- మన దేశంలో గత వారం కొత్త కేసులు 1,268
- అంతకుముందు వారంతో పోలిస్తే తగ్గిన కేసులు
- ఆందోళన అక్కర్లేదంటున్న నిపుణులు
మూడు వారాల నుంచి చైనా నిత్యం లక్షలాది కేసులతో వణికిపోతోంది. మన దేశానికి వాయు మార్గాలను కూడా మూసివేయలేదు. అంతర్జాతీయంగా అన్ని దేశాలకు భారత్ నుంచి సర్వీసులు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే రిస్క్ ఉన్న చైనా, తదితర కొన్ని దేశాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మన దేశంలో ఇప్పటికీ రోజువారీ కరోనా కేసులు 100-200 మధ్యలోనే ఉంటున్నాయి. గత ఆదివారంతో ముగిసిన వారంలో మన దేశంలో కొత్తగా 1,268 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతకుముందు వారంలో ఇవి 1,526గా ఉన్నాయి. అంతేకాదు, గడిచిన ఆరు వారాల నుంచి వారం వారీ కేసులు 2,000లోపే ఉంటున్నాయి. మన దగ్గర కరోనా రిస్క్ లేదనడానికి ఈ గణాంకాలను నిదర్శనంగా నిపుణులు పేర్కొంటున్నారు.
గత వారం ఒక్క కర్ణాటక రాష్ట్రంలోనే కేసులు రెట్టింపయ్యాయి. కేరళలో కేసులు, మరణాలు ఎక్కువగా వచ్చాయి. జనవరి 2-8 మధ్య 383 కేసులు నమోదు కాగా, ఏడు మరణాలు చోటు చేసుకున్నాయి. కర్ణాటకలో 225 కేసులు వచ్చాయి.