COVID19: తెలంగాణలో విజృంభిస్తున్న ఒమిక్రాన్​ కేసులు

Omicron variants rises in Telangana
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా కరోనా వ్యాప్తి క్రమంగా  పెరుగుతోంది. రోజువారి కేసుల సంఖ్య రెండు వేలకు చేరుకుంది. ఇందులో ఒమిక్రాన్ వేరియంట్లు ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో కరోనా వైరస్ జన్యు శ్రేణి,  వైరస్ వైవిధ్యాన్ని అధ్యయనం చేసే INSACOG సంస్థ నివేదిక ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం BA5, BA4, BA.2.12.1 రకాల ఒమిక్రాన్ వేరియంట్లు సామాజిక వ్యాప్తి దశలో ఉన్నాయని తేలింది.

    రాష్ట్రంలో  కోవిడ్ కేసుల  పెరుగుదలకు ఈ  మూడు రకాలే  కారణమవుతున్నాయని  జూన్ 15 వరకు ఉన్న డేటా సూచిస్తోంది. BA5 పాజిటివ్ కేసులు ఇప్పుడు 21కి చేరగా, పది BA4 కేసులు ఉన్నాయి. మరో 51 మందిలో BA.2.12.1 వేరియంట్‌ను   గుర్తించినట్టు  INSACOG తెలిపింది. అమెరికా, యూరప్ దేశాలలో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం. 
 
  తెలంగాణలో యాక్టివ్‌గా ఉన్న ఈ మూడు వేరియంట్లు చాలా వేగంగా వ్యాపించగలవు. అలాగే వీటికి యాంటీబాడీస్ నుండి తప్పించుకునే సామర్థ్యం ఉంటుంది.  BA4, BA5 అయితే  వ్యాక్సిన్ నుంచి వచ్చే ప్రతిరోధకాలను కూడా తప్పించుకోగలవని,  BA1కు సహజ ప్రతిరోధకాలను తప్పించుకునే సామర్థ్యం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. 

BA4 , BA5 వేరియంట్లు  దక్షిణాఫ్రికా, అమెరికాతో పాటు ఐరోపా దేశాలలో అధికంగా వ్యాప్తి చెందాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులకు కూడా సోకిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ వేసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యాధికారులు చెబుతున్నారు. BA4 , BA5 వ్యాప్తి ఎక్కువ ఉన్నప్పటికీ వాటి వల్ల తీవ్రమైన లక్షణాలు ఏమీ ఉండటం లేదంటున్నారు. అందుకే  రోజువారీ కేసుల సంఖ్య పెరిగినప్పటికీ బాధితులు ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరడం లేదని, మరణాలు కూడా అదుపులోనే ఉన్నాయని అంటున్నారు.
Go Back to Shorts
COVID19
Omicron
Telangana
daily cases
vaccine

More Telugu News