తన వాకింగ్ కోసం రోడ్నే బ్లాక్ చేయించిన ట్రాఫిక్ ఏసీపీ.. ఎక్కడంటే..!
- కొచ్చిలో ట్రాఫిక్ ఏసీపీ వినోద్ పిళ్లై నిర్వాకం
- ఇబ్బంది పడ్డ సాధారణ ప్రజలు
- నోటీసులు జారీ చేసిన ఉన్నతాధికారులు
కొచ్చి ట్రాఫిక్ వెస్ట్ జోన్ లో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్న వినోద్ పిళ్లై క్వీస్ వాక్‌వేలో ప్రతి రోజు ఉదయం వాకింగ్ కు వస్తుంటారు. సాధారణంగా ప్రతి ఆదివారం ఉదయం 6-7 గంటల వరకు పిల్లలు సైకిల్ తొక్కడం, స్కేటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఈ రహదారిని మూసివేస్తారు. కానీ వినోద్ పిళ్లై తన వాకింగ్ కోసం ఇతర రోజుల్లో కూడా రహదారిని బ్లాక్ చేయించారు.
గత మూడు రోజులుగా రోడ్డుపైకి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ మళ్లించిన ఫొటోలు, ఆ రోడ్డుకు అవతలి వైపు నుంచి పిల్లలను బస్సులు ఎక్కిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు ఏసీపీ నిర్వాకం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దాంతో, ఆయనకు నోటీసులు జారీ చేశారు.