Trauma: గలగలా మాట్లాడే అమ్మాయికాస్తా మూగబోయింది.. నరకం అనుభవిస్తున్న గ్యాంగ్ రేప్ బాధిత బాలిక

Hyderabad Gang Rape Minor Victim Going Severe Mental Trauma
  • అమ్మ చొరవతో దారుణం వెలుగులోకి
  • సంతోషంగా వెళ్లి బాధగా తిరిగొచ్చిన బిడ్డ
  • ఏం జరిగిందో ఆరా తీసిన అమ్మ
  • ముభావంగా బదులు చెప్పడంతో మానసిక నిపుణుడితో కౌన్సిలింగ్
  • ఆ తర్వాత భరోసా సెంటర్ కు
  • మనసులో బాధను వెళ్లగక్కిన బాధితురాలు
వారం క్రితం వరకు ఆ అమ్మాయి గలగలా మాట్లాడేది. ఎంతో చలాకీగా ఆడుతూపాడుతూ ఉండేది. కానీ, ఒక్క వారంలోనే ఆ అమ్మాయి జీవితం తిరగబడిపోయింది. మౌనం, ముభావం, బాధే ఇప్పుడు ఆ అమ్మాయి నేస్తాలయ్యాయి. అమ్మానాన్నతో కూడా మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. అవును, కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో సామూహిక అత్యాచారానికి గురైన బాలిక దీనావస్థే ఇది. 

అమ్మ చొరవతో...

వాస్తవానికి ఫేర్ వెల్ పార్టీకి వెళ్లడానికన్నా ఒకరోజు ముందే ఆ అమ్మాయి ఇంట్లో అమ్మానాన్నల అనుమతి తీసుకుందట. పార్టీ ఉన్న రోజు స్నేహితురాలితో కలిసి బయటకు వచ్చింది. సాయంత్రం 5.30 గంటలకు ఇంటికి రావాల్సిన ఆ అమ్మాయి ఆలస్యంగా చేరుకుంది. ఎంత సంతోషంతో వెళ్లిందో అంతకన్నా ఎక్కువ బాధతో ఇల్లు చేరిందా బాలిక. పార్టీ అలసట కావచ్చేమో అనుకుంది తల్లి. 

అయినా సరే కన్నపేగు నిలువదు కదా.. ఏం జరిగిందో ఆరా తీసింది. ముభావంగా సమాధానాలిస్తుండడంతో ఓ మానసిక నిపుణుడి వద్దకు తీసుకెళ్లారు ఆమె తల్లిదండ్రులు. అక్కడ కూడా ఆ అమ్మాయి అంతే ముభావంగా సమాధానాలిచ్చింది. మానసిక నిపుణుడి సూచన మేరకు భరోసా సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ కౌన్సిలర్లు అమ్మాయి నుంచి ప్రేమగా విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నించారు. అయినా షాక్ లో ఉన్న ఆ బాలిక కొన్ని రోజులు విషయం చెప్పలేదు. 

చివరకు కౌన్సిలర్ల ప్రయత్నం ఫలించింది. ఆ అమ్మాయి కన్నీరు తుడుచుకుంటూ మనసు లోపల రగులుతున్న అగ్నిపర్వతాన్ని బద్దలుకొట్టింది. తనకు జరిగిన ఘోరమైన, భీతికరమైన ఘటనను వివరించింది. స్నేహితులని నమ్మి వెళ్తే అతి దారుణంగా ప్రవర్తించారని తెలిపింది. అప్పుడు వైద్య పరీక్షలు చేయిస్తే సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ అయింది. ఒంటిపైన అయిన గాయాలను చూసిన ఆమె తల్లి కన్నీరుమున్నీరైంది. ఇప్పటికీ తమ కూతురు ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడకపోతుండడంతో ఆ తల్లిదండ్రుల గోస వర్ణనాతీతంగా మారింది.
Trauma
Gang Rape
Crime News
Telangana
Hyderabad

More Telugu News