రాష్ట్రాన్ని వదిలేసి.. దేశాన్ని ఉద్ధరిస్తానని తిరుగుతున్నాడు: విజయశాంతి
- జనాలను మోసగించడానికి కేసీఆర్ ఏ స్థాయికైనా వెళతారన్న విజయశాంతి
- ప్రజలు నిలదీస్తారనే రాష్ట్రం బయట తిరుగుతున్నారంటూ విమర్శలు
- సమ్మర్ వెకేషన్ గా ఊళ్లు తిరిగే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఎద్దేవా
2014లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ జపం చేసి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేస్తానంటూ వారిని ఊరించి, చివరకు ఝలక్ ఇచ్చారని విజయశాంతి దుయ్యబట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తాను సీఎం అయ్యాక కూడా తనకు అలవాటైన కప్పదాటుడు వ్యవహారాలు, ఇచ్చిన మాట తప్పడం, చేసిన వాగ్దానాలను మర్చిపోవడం వంటి చర్యలతో గత ఏడేళ్ల పైచిలుకు పాలనాకాలంలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, బీజేపీ విజయాల నేపథ్యంలో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన కేసీఆర్ గారికి.. కమలదళం తన పాలనకు చరమగీతం పాడుతుందనే భయం పట్టుకుందని అన్నారు.
రాష్ట్రంలో ఉంటే ఎక్కడకు వెళ్లినా జనం నిలదీస్తారనే ఆందోళనతో జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రం బయట తిరగడం మొదలుపెట్టారని విజయశాంతి ఎద్దేవా చేశారు. తనను ఛీకొడుతున్న తెలంగాణ ప్రజల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ సమ్మర్ వెకేషన్ గా ఈ ఊళ్లు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మరొకటి కాదని అన్నారు.
దేశంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, జవాన్ల కుటుంబాలకు సాయం చేయడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ... కేసీఆర్ సీఎం అయ్యాక గత ఏడేళ్ల కాలంలో ఒక్క తెలంగాణలోనే 7 వేలకు పైగా రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని... వీరందరినీ గాలికొదిలేసి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ తిరగడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. గత ఏడేళ్లలో దేశం మొత్తం మీద కూడా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి మరణాలు ఎన్నో జరిగాయని.. వారి కుటుంబాలను కేసీఆర్ ఆదుకుంటారా? అని అడిగారు. తనను ఎన్నుకున్న రాష్ట్రానికే న్యాయం చేయని వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.