పుస్తకరూపంలో జనసేన పార్టీ ప్రస్థానం, పవన్ కల్యాణ్ ప్రసంగాలు... ఫొటోలు ఇవిగో!
Add ap7am to your home Screen

పుస్తకరూపంలో జనసేన పార్టీ ప్రస్థానం, పవన్ కల్యాణ్ ప్రసంగాలు... ఫొటోలు ఇవిగో!

Books on Janasena journey and Pawan Kalyan speeches
  • 2014లో జనసేన ఆవిర్భావం
  • ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి
  • ఏడు సంకలనాలు రూపొందించిన జనసేన మీడియా కమిటీ
  • పుస్తకాలు పవన్ కు అందజేత
  • ఆశ్చర్యపోయిన జనసేనాని
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. 2014 మార్చి 14న జనసేన అవతరించింది. ఈ ఏడాది మార్చి 14న ఇప్పటంలో జనసేన పార్టీ భారీ ఎత్తున ఆవిర్భావ సభ నిర్వహించింది. 

ఈ నేపథ్యంలో, ఆవిర్భావం నుంచి నేటి వరకు జనసేన పార్టీ ప్రస్థానం, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగాలను పుస్తకాల రూపంలో తీసుకువచ్చారు. ఏడు సంకలనాలుగా రూపొందించిన ఈ పుస్తకాలను జనసేన మీడియా విభాగం నేడు హైదరాబాదులో పవన్ కల్యాణ్ కు అందించింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పార్టీ మీడియా విభాగం ప్రతినిధులను అభినందించారు. 

అనంతరం పవన్ మాట్లాడుతూ, ఈ పుస్తకాలు తనకు ఎంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించాయని అన్నారు. ఈ ప్రస్థానంలో జనసేన పార్టీ ప్రజలతో ఎంతగా మమేకం అయిందీ, ప్రజాసేవకు ఏ విధంగా చిత్తశుద్ధితో అంకితమైందీ ఈ ఏడు సంకలనాలు తెలియజేస్తున్నాయని వివరించారు. పార్టీ సిద్ధాంతాలు, పార్టీ విధివిధానాలు, ప్రజాసమస్యలు, రాజకీయ, సామాజిక అంశాలపై చేసిన ప్రసంగాలను అక్షరబద్ధం చేయడం పార్టీ శ్రేణులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

ఈ పుస్తకాలు తనకు ఒక దిక్సూచిలా ఉన్నాయని అభివర్ణించారు. ప్రతి జిల్లాలో మాట్లాడినవి, స్థానిక సమస్యల నుంచి రాష్ట్ర స్థాయిలో సమస్యల వరకు ఏ విధంగా స్పందించామో ఈ పుస్తకాలు తెలియజేస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ మీడియా విభాగం ప్రతినిధులకు పేరుపేరునా ఆయన అభినందనలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్, మీడియా విభాగం ప్రతినిధులు చక్రవర్తి, ఎల్. వేణుగోపాల్ పాల్గొన్నారు.
Janasena
Pawan Kalyan
Books
Volumes
Speeches
Andhra Pradesh

More Telugu News