అందుకే ‘బాషా 2’కి నో చెప్పా.. ‘జైలర్‌ 2’కు ఓకే చెప్పా: రజనీకాంత్‌
Add ap7am to your home Screen

అందుకే ‘బాషా 2’కి నో చెప్పా.. ‘జైలర్‌ 2’కు ఓకే చెప్పా: రజనీకాంత్‌

Why Rajinikanth said no to Baasha 2 and Petta 2 but accepted Jailer 2
  • జైలర్‌ సీక్వెల్‌కు ఓకే చెప్పడంపై అభిమానుల్లో ఆసక్తి
  • ‘జైలర్‌’లో రెండో భాగానికి సంబంధించిన బలమైన పునాది ఉందన్న రజనీ
  • అందుకే స్వయంగా ఫోన్‌ చేసి ‘జైలర్‌ 2’కు ఓకే చెప్పినట్లు వివరణ
  • అక్టోబరు 15న సినిమా విడుదల
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సాధారణంగా సీక్వెల్‌ సినిమాలకు దూరంగా ఉంటారు. గతంలో ‘బాషా 2’, ‘పేట 2’ చిత్రాల ఆఫర్లను కూడా తిరస్కరించారు. కానీ ‘జైలర్ 2’ విషయంలో మాత్రం వెంటనే అంగీకరించారు. ఎందుకలా? కేవలం సినిమా విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోలేదని రజనీకాంత్‌ చెప్పారు. కథలోనే రెండో భాగానికి బలమైన పునాది ఉండటంతో ఓకే చెప్పానని వెల్లడించారు.

‘జైలర్ 2’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన ఈ విషయాలను పంచుకున్నారు. సాధారణంగా మొదటి భాగంలోని కథకు కొన్ని కొత్త అంశాలు జోడించి రెండో భాగాన్ని తెరకెక్కిస్తారని తాను భావిస్తానని రజనీ తెలిపారు. అందుకే సీక్వెల్స్‌పై పెద్దగా ఆసక్తి చూపనని చెప్పారు.

గతంలో ‘బాషా 2’కి అంగీకరించలేదని, విజయ్‌ సేతుపతి పాత్రను కొనసాగిస్తూ ‘పేట 2’ తీయాలన్న దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ప్రతిపాదనను కూడా తిరస్కరించానని గుర్తు చేసుకున్నారు.

‘జైలర్‌’ క్లైమాక్సే కారణం!
‘జైలర్‌’ సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత మరోసారి చూశానని రజనీకాంత్‌ చెప్పారు. అప్పుడు సీక్వెల్‌ ఆలోచనపై తన అభిప్రాయం మారిందన్నారు. క్లైమాక్స్‌లో విగ్రహాల స్మగ్లర్‌ వర్మ చనిపోయే ముందు జైలర్‌ ముత్తువేల్‌ పాండియన్‌ను ఓ పెద్ద నెట్‌వర్క్‌ గురించి హెచ్చరిస్తాడు. ఆ నెట్‌వర్క్‌ గురించి సినిమా అంతటా దర్శకుడు నెల్సన్‌ చిన్నచిన్న సంకేతాలు ఇచ్చాడని రజనీ వివరించారు.

అంతేకాదు.. రూ.వేల కోట్ల విలువైన మూడు కంటైనర్లు జైలర్‌ దగ్గర ఉండటం, నాగ్‌పూర్‌ జైలులో పనిచేసిన సమయంలోనే కరుడుగట్టిన రౌడీలు, దాదాల్లో ముత్తువేల్‌ పాండియన్‌పై భయం, గౌరవం ఉండటం వంటి అంశాలు రెండో భాగానికి సహజమైన పునాదిగా అనిపించాయని చెప్పారు.

ఈ అంశాలన్నీ గుర్తించిన తర్వాత తానే దర్శకుడు నెల్సన్‌కు ఫోన్‌ చేసి ‘జైలర్ 2’కి అంగీకరించినట్లు రజనీకాంత్‌ వెల్లడించారు. కేవలం కమర్షియల్‌ విజయాన్ని ఆశించి కాకుండా, కథకు కొనసాగింపు ఉండటమే తన నిర్ణయానికి కారణమని స్పష్టం చేశారు.

సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మించిన ఈ చిత్రంలో విద్యాబాలన్‌, మిథున్‌ చక్రవర్తి, ఎస్‌జే సూర్య, సూరజ్‌ వెంజరమూడు కీలక పాత్రల్లో నటించారు. మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అక్టోబరు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Advertisement
Rajinikanth
Jailer 2
Nelson Dilipkumar
Baasha 2
Petta 2
Sun Pictures

More Telugu News