Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పుచ్చకాయలోని నల్ల విత్తనాలు పడేయకండి.. వాటితో ఆరోగ్యం

Amazing health benefits of eating watermelon seeds
  • వీటిల్లో ఎన్నో విలువైన పోషకాలు
  • వ్యాధి నిరోధక శక్తికి మేలు
  • గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి
  • ఎముకల పటుత్వానికి సాయం
  • వేయించుకుని రోజూ కొద్ది మొత్తం తీసుకోవచ్చు
వేసవిలో పుచ్చకాయ (వాటర్ మెలాన్) లను ఎక్కువ మంది తినడం సర్వ సాధారణం. తక్కువ రేటులో ఎక్కువ మంది కడుపు నింపే పండు ఇది. పుచ్చకాయను కోసి తినే సమయంలో నల్ల విత్తనాలు వస్తే వాటిని ఎక్కువ మంది ఊసేస్తుంటారు. కోసే సమయంలోనే విత్తనాలను పారేసి తినే వారు కూడా ఉంటారు. కానీ, పుచ్చ విత్తనాలను పడేయడం వల్ల నష్టమే కానీ లాభం లేదు. 

పుచ్చకాయలో 92 శాతం నీరే ఉంటుంది. అందుకే డీహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. శరీరంలో నీటి పరిమాణం, లవణాలు తగ్గిపోయిన వారికి పుచ్చకాయ తినిపిస్తే త్వరగా కోలుకుంటారు. ఇందులోని విత్తనాలు రుచిగా అనిపించవు. అందుకే వాటిని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడరు. కానీ, చిన్నగా ఉండే ఈ విత్తనాల్లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉన్నాయని తెలుసుకోవాలి. పుచ్చ విత్తనాల్లో కేలరీలు తక్కువ. కాపర్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫోలేట్ లభిస్తాయి. వీటితో మనకు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 

వ్యాధి నిరోధక శక్తి
బలమైన వ్యాధి నిరోధక శక్తికి, చక్కని ఆరోగ్యానికి పుచ్చ విత్తనాలు మేలు చేస్తాయి. వీటిల్లోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిత్యం కొన్ని విత్తనాలు తీసుకోవాలి. మంచిది కదా అని మరీ ఎక్కువ తీసుకోకూడదు.

ఎముకలు దృఢంగా
పుచ్చ విత్తనాల్లో కాపర్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండడం వల్ల, వీటితోపాటు ఇతర సూక్ష్మ పోషకాల సాయంతో మన ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల సాంద్రతను కూడా పెంచుతుంది.

జీవక్రియలకు సాయం
పుచ్చకాయ విత్తనాల్లోని ఫోలేట్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా విలువైన పోషకాలు. వీటిల్లో అమైనో యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలసి జీవక్రియలకు సాయపడతాయి. ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ అయిన.. ఒలిక్ యాసిడ్, లినోలియం యాసిడ్  ఇందులో ఉన్నాయి. 

మధుమేహానికీ మంచిదే
మధుమేహం నియంత్రణకు సైతం పుచ్చవిత్తనాలు సాయపడతాయి. రక్తంలో పెరిగిన గ్లూకోజ్ ను తగ్గిస్తుంది. 

చర్మ సంరక్షణ
పుచ్చకాయ విత్తనాల నుంచి తీసిన నూనెను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నారు. చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా ఉంచుతుంది. ముడతలు పడడాన్ని ఆపుతుంది. పెనంలో పుచ్చవిత్తనాలను వేయించి గాలి చొరబడని డబ్బాలో పోసుకోవాలి. దీన్ని రోజూ స్నాక్ గా కొద్ది మొత్తంలో తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందొచ్చు.
health
benefits
water melon seeds

More Telugu News