జాతీయ రాజకీయాల్లోకి టీఆర్​ఎస్​.. ప్లీనరీ షురూ, 13 తీర్మానాల ప్రతిపాదన

TRS Plenary Starts As party Looks Forward to National Politics
  • తెలంగాణ భవన్ లో కేక్ కట్ చేసిన కేటీఆర్
  • అనంతరం హైటెక్స్ లో మొదలైన ఆవిర్భావ వేడుకలు
  • ధాన్యం కొనుగోళ్లు, దళితబంధు, టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలపై తీర్మానాలు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఉత్సవాలు కొద్దిసేపటి క్రితమే షురూ అయ్యాయి. వేడుకలకు కేవలం 3 వేల మంది ప్రతినిధులనే ఆహ్వానించారు. 

హైటెక్స్ లో వేడుకలకు ముందుగా తెలంగాణ భవన్ లో కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ల సమక్షంలో ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేశారు. తలసాని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 40 అడుగుల ఎత్తైన జెండాను కేటీఆర్ ఆవిష్కరించారు. 

హైటెక్స్ లో టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా పార్టీ 13 తీర్మానాలను సిద్ధం చేశారు. సీఎం కేసీఆర్ స్వాగతోపన్యాసం తర్వాత ఆ తీర్మానాలను మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. 

ఇవే ఆ తీర్మానాలు...

1. యాసంగిలో కేంద్రం ధాన్యం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం. 
2. దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య పాత్ర పోషించేందుకు రాజకీయ తీర్మానం. 
3. ఆకాశాన్ని అంటేలా ధరలను పెంచుతూ పేదలు, మధ్యతరగతి ప్రజల మీద భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తీర్మానం. 
4. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
5. దేశ సామరస్య సంస్కృతిని కాపాడుకుని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం.
6. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి.. జనగణనలో బీసీల లెక్కలు తీయాలని డిమాండ్ చేస్తూ మరో తీర్మానం.
7. తెలంగాణలో రిజర్వేషన్ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం. 
8. రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ సెస్ ల రూపంలో పన్నులు వసూలు చేయడం మానుకోవాలని, డివిజబుల్ పూల్ లోనే పన్నులను వసూలు చేయాలని తీర్మానం. 
9. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను నిర్ణయించి.. బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇంకో తీర్మానం. 
10. రాజ్యాంగం ఇచ్చిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం. 
11. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేసేలా డిమాండ్. 
12. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్. 
13. చేనేత వస్త్రాలపై కేంద్రం విధించిన జీఎస్టీని ఎత్తేయాలని డిమాండ్.
Go Back to Shorts
TRS
TRS Formation Day
Telangana

More Telugu News