ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు? అనుకున్నా: నాగచైతన్య

Naga Chaitnaya responds to gossips
  • చై, సామ్ ల కాపురంపై కథనాలు
  • విడాకులకు దరఖాస్తు చేశారంటూ ప్రచారం
  • మొదట్లో కొద్దిగా బాధపడ్డానన్న నాగచైతన్య
  • ఇప్పుడసలు పట్టించుకోవడంలేదని వెల్లడి
నాగచైతన్య, సమంతల కాపురంలో విభేదాలు ఏర్పడ్డాయని, వారు త్వరలోనే విడిపోనున్నారని విపరీతంగా కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య స్పందించారు. తీవ్రస్థాయిలో వస్తున్న పుకార్లను చూసి మొదట్లో కొద్దిగా బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి వార్తలు ఎలా రాస్తారు? అని వేదనకు గురయ్యేవాడ్నని పేర్కొన్నారు.

పాత రోజుల్లో మాస పత్రికలు ఉండేవని, వాటిలో ఓ వార్త రాస్తే నెలంతా అదే ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని, కొద్దిసేపట్లోనే ఒక వార్తను తోసిరాజని మరో వార్త వచ్చేస్తోందని అన్నారు. ప్రజలు కూడా ఎన్ని వార్తలు వచ్చినా నిజాలనే గుర్తుంచుకుంటారన్న విషయం అర్థమైందని, అప్పటినుంచి గాసిప్స్ గురించి పట్టించుకోవడం మానేశానని నాగచైతన్య వెల్లడించారు.

అయితే గాసిప్స్ కోసం తన పేరును వాడుకుంటుండడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి వృత్తిపరమైన జీవితం, వ్యక్తిగత జీవితం ఉంటాయని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. తన తల్లిదండ్రులను గమనించడం ద్వారా వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని విడివిడిగా చూడడం అలవర్చుకున్నానని తెలిపారు. తన తల్లిదండ్రులు తమ పనులు ముగించుకుని వచ్చిన తర్వాత ఇంట్లో బయటి విషయాలు చర్చించుకోరని, వారి నుంచి తాను కూడా అదే దృక్పథాన్ని అలవర్చుకున్నానని చైతూ పేర్కొన్నారు.

నాగచైతన్య హీరోగా నటించిన 'లవ్ స్టోరీ' చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Naga Chaitanya
Samantha
Marital Life
Tollywood

More Telugu News