అమెరికాలో ప్రతి ఇద్దరు ఇండియన్ అమెరికన్లలో ఒకరిపై వివక్ష: తేల్చిన సర్వే

1 in 2 Indian American Face Discrimination In USA
  • తోటి భారతీయ మూలాలున్న వారితోనే వివాహాలు
  • 3 అమెరికా యూనివర్సిటీలు కలిసి సర్వే
  • అమెరికన్ భారతీయుల సామాజిక స్థితిగతులపై నివేదిక
అమెరికాలో చైనా తర్వాత ఎక్కువ మంది వలసదారులు భారతీయులే. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు, సైన్స్, టెక్నాలజీ.. ఏ రంగం తీసుకున్నా వారి హవా ఎక్కువే. అలాంటి ఇండియన్ అమెరికన్లపై వివక్ష ఎక్కువవుతోంది. ప్రతి ఇద్దరిలో ఒకరు జాతి వివక్ష లేదా మత వివక్షను ఎదుర్కొంటున్నారు. కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్ ఎస్ఏఐఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా కలిసి గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 20 మధ్య ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్ సర్వే (ఐఏఏఎస్) చేశాయి.

ఆన్ లైన్ లో 1,200 మంది ఇండియన్ అమెరికన్ల అభిప్రాయాలను అధ్యయనకారులు తీసుకున్నారు. ఆ సర్వేకి సంబంధించి బుధవారం ‘భారతీయ అమెరికన్ల సామాజిక స్థితిగతులు’ పేరిట నివేదికను విడుదల చేశారు. ఏడాది కాలంగా అమెరికాలోని సగం మంది ఇండియన్ అమెరికన్లు వివక్షను ఎదుర్కొంటున్నారని సర్వేలో తేలింది. ఆశ్చర్యకరంగా అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్లపైనే ఎక్కువ వివక్ష ఉంటోందని పరిశోధకులు గుర్తించారు.

ప్రతి పది మంది ఇండియన్ అమెరికన్లలో 8 మంది.. తోటి భారతీయ మూలాలున్న వారినే పెళ్లి చేసుకుంటున్నారని తేలింది. సర్వేలో పాల్గొన్న మూడొంతుల మంది తమ జీవితాల్లో మతం చాలా కీలకమైందని తేల్చి చెప్పారు. హిందువుల్లో సగం మంది పేరుకు కులాన్ని కచ్చితంగా తగిలించుకుంటున్నారని గుర్తించారు.

అమెరికాలోని భారతీయ మూలాలున్న వారిని ఇండియన్ అమెరికన్లు అని పిలుస్తున్నా.. అలా పిలవడం ఇష్టం లేదని 60 శాతం మంది పేర్కొన్నారు. కాగా, 2018 గణాంకాల ప్రకారం అమెరికాలో ప్రస్తుతం 42 లక్షల మందికిపైగా భారతీయ మూలాలున్న వారు నివసిస్తున్నారు.
Go Back to Shorts
USA
India
Indian American
Discrimination

More Telugu News