ఆదిలాబాద్‌లో విషాదం.. ఒకరి తర్వాత ఒకరిగా దంపతుల మృతి

ఆదిలాబాద్‌లో విషాదం.. ఒకరి తర్వాత ఒకరిగా దంపతుల మృతి

Tragedy in Adilabad as couple dies one after another
  • 24 గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి
  • కామెర్ల వ్యాధితో భార్య, ఆపై కొన్ని గంటలకే భర్త కన్నుమూత
  • తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన పదేళ్ల కుమారుడు
  • భార్య మరణాన్ని తట్టుకోలేకనే భర్త మృతి!
ఆదిలాబాద్ పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 24 గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో వారి పదేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. పట్టణంలోని పిట్టలవాడకు చెందిన నైతం నవీన్ కుమార్ (33) స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య లత (31). వీరికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు.

కొంతకాలంగా లత పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో జగిత్యాలలో చికిత్స తీసుకుని శుక్రవారం తిరిగి వస్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచారు. శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

భార్య మరణంతో తీవ్ర వేదనకు గురైన నవీన్ కుమార్, శనివారం రాత్రి 8:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన కూడా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నారని తెలిసింది. భార్య చనిపోయిన కొన్ని గంటలకే భర్త కూడా మరణించడంతో ఆ కుటుంబంలో తీరని శోకం మిగిలింది. భార్య మరణాన్ని తట్టుకోలేకనే నవీన్ గుండె ఆగిపోయి ఉంటుందని స్థానికులు, బంధువులు భావిస్తున్నారు.

ఒకే రోజు తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఆ పదేళ్ల బాలుడు మృతదేహాల వద్ద రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.  
Advertisement
Naitham Naveen Kumar
Adilabad couple death
Excise department junior assistant
Pittalawada Adilabad tragedy
Orphaned child Adilabad
Couple dies within 24 hours

More Telugu News