కుప్పకూలిన ఇజ్రాయెల్ ప్రభుత్వం.. మళ్లీ ఎన్నికలు
Add ap7am to your home Screen

కుప్పకూలిన ఇజ్రాయెల్ ప్రభుత్వం.. మళ్లీ ఎన్నికలు

Israel govt collapses triggering 4th election in 2 years
  • గడువులోగా బడ్జెట్‌ను ఆమోదించడంలో విఫలం 
  • వచ్చే ఏడాది మార్చి 23న తిరిగి ఎన్నికలు
  • గత రెండేళ్లలో ఇజ్రాయెల్‌లో నాలుగోసారి ఎన్నికలు
గడువులోగా బడ్జెట్‌ను ఆమోదించడంలో విఫలం కావడంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. వచ్చే ఏడాది మార్చి 23న తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గత రెండేళ్లలో ఇజ్రాయెల్‌లో ఎన్నికల జరుగుతుండడం ఇది నాలుగోసారి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో బెన్నీ గాంట్జ్ నేతృత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీతో కలిసి నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి పదవిని పంచుకోవాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నాయి. 18 నెలలు నెతన్యాహు ప్రధానిగా పనిచేసిన అనంతరం బ్లూ అండ్ వైట్ పార్టీకి పగ్గాలు అప్పగించాలని ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒప్పందం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.

అయితే, ఇటీవల ఇరు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కనీసం బడ్జెట్ కూడా ఆమోదింప చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో పార్లమెంటు రద్దయింది. ఇరు పార్టీలు పరస్పరం తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి.

కరోనా విజృంభణ సమయంలో బ్లూ అండ్ వైట్ పార్టీ ప్రభుత్వం కూలిపోయేలా వ్యవహరించిందంటూ నెతన్యాహు విమర్శించారు. అయితే, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నెతన్యాహు సొంత ప్రయోజనాలను చూసుకుంటున్నారంటూ బ్లూ అండ్ వైట్ పార్టీ విమర్శలు గుప్పించింది.
Israel
Benjamin Netanyahu

More Telugu News