Kerala: భార్య వల్లే మందుకు బానిసనయ్యానన్న వ్యక్తి... కొట్టేసిన విడాకుల పిటిషన్ ను స్వీకరించిన కేరళ హైకోర్టు

Kerala Highcourt Comments on divorce and harrasment
షార్ట్స్‌లో చూడండి
భార్య నుంచి విడాకులు కోరిన ఓ భర్త పిటిషన్ ను కింది కోర్టు కొట్టివేయగా, హైకోర్టు దాన్ని స్వీకరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసిన ఘటన కేరళలో జరిగింది. కోడలితో పనులు చేయించడం, చేయమని చెప్పడం చాలా సాధారణమైన విషయమేనని, అంతమాత్రానికే వేరు కాపురం పెట్టాలని వేధించడం సరికాదని వ్యాఖ్యానించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే...

కేరళకు చెందిన ఓ యువకుడు, యువతికి 2003లో పెళ్లి కాగా, వారికి ఓ అమ్మాయి జన్మించింది. రోజులు గడుస్తున్న కొద్దీ, భర్తతో, అత్తతో ఆమెకు విభేదాలు వచ్చాయి. దీంతో ఆమె, వేరు కాపురం పెట్టాలని వేధింపులు ప్రారంభించగా, భర్త అంగీకరించలేదు. దీంతో ఆమె 2011లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఎన్నిమార్లు ఇంటికి రావాలని కోరినా రాకపోవడంతో, విడాకులు ఇవ్వాలంటూ ఫ్యామిలీ కోర్టుకు ఎక్కాడు.

ఆపై కోర్టులో విచారణ సాగగా, తనకు విడాకులు ఇవ్వాలన్న ఆలోచన లేదని, భర్తతో తనకు ఇబ్బంది లేదని, ఆయన తల్లి తోనే తనకు సమస్యలు ఉన్నాయని కోర్టుకు చెప్పింది. కాన్పు అయిన తరువాత కుట్లు కూడా విప్పకుండానే పని చేయాలని ఒత్తిడి చేసిందని, నిత్యమూ హింసించేదని ఆరోపించింది. భర్తతో విడిగా ఉంటే తనకు సమస్యలు రాబోవని భావిస్తున్నానని చెప్పింది. దీంతో, విడాకులు ఇచ్చేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరిస్తూ, 2014లోనే కేసును కొట్టేసింది.

ఆపై భర్త హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య నలుగురి ముందూ తిడుతూ ఉండేదని, భర్తగా తాను పనికిరానని అనేదని, తనతో సన్నిహితంగా ఉండదని, ఆమె కారణంగానే తాను మద్యానికి బానిసను అయ్యానని చెప్పుకున్నాడు. తన పిటిషన్ స్వీకరించి విడాకులు ఇప్పించాలన్నాడు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు, భార్య చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు లేవని వ్యాఖ్యానిస్తూ, ఇంటిలో కోడలికి పనులు చెప్పడం అసాధారణమేమీ కాదని వ్యాఖ్యానించింది.

భార్య ప్రవర్తనతో పిటిషనర్ సంతోషంగా లేడని తెలుస్తోందని, ఆయన భార్య కావాలనే గొడవలకు దిగినట్టుగా సాక్ష్యాలు చెబుతున్నాయని పేర్కొంటూ, విడాకుల పిటిషన్ ను స్వీకరిస్తున్నామని పేర్కొంది.
Go Back to Shorts
Kerala
High Court
Marriage
Divorce

More Telugu News