ఆ డబ్బేదో మేమే ఇస్తాం, తీసుకోండి: కేంద్రంపై నిప్పులు చెరిగిన సోనియా గాంధీ
- రైలు ప్రయాణానికి డబ్బులు చెల్లించాలన్న కేంద్రం
- పేద ప్రజలు స్వస్థలాలకు వెళుతుంటే డబ్బివ్వమనడం దారుణం
- కావాలంటే తమ పార్టీ తరఫున డబ్బిస్తామని సోనియా లేఖ
"భారత జాతి వృద్ధికి మన కార్మికులే అంబాసిడర్లు. పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని గుర్తించి, ఉచితంగా విమానాల్లో వారి స్వరాష్ట్రాలకు చేర్చడం ప్రభుత్వం బాధ్యత. గుజరాత్ లో కేవలం ఓ కార్యక్రమానికి ప్రజల తరలింపు, వారికి ఆహారం కోసం రూ. 100 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ప్రధాన మంత్రి కరోనా నిధికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ. 151 కోట్లను అందించింది. ఆ నిధులతో కనీసం వలస కార్మికులకు ఉచిత రైలు ప్రయాణాన్ని అందించలేరా? ఇంతటి కష్టకాలంలో, వారిని ఆదుకునే మంచి మనసు ఎందుకు రావడం లేదు?" అని సోనియా ప్రశ్నించారు.
లాక్ డౌన్ అమలులోకి వస్తుందని కేవలం నాలుగు గంటల ముందు నోటీసులు ఇవ్వడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. కనీసం పేదలు, వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరే సమయమైనా ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. 1947లో దేశం విడిపోయిన తరువాత, వేలాదిమంది మరో దారిలేక.. వందలాది కిలోమీటర్ల దూరం నడుస్తూ తమ స్వగ్రామాలకు వెళ్లవలసి రావడం ఇదే తొలిసారని వ్యాఖ్యానించిన సోనియా గాంధీ, వారికి కనీస వసతులైన ఆహారం, ఔషధాలు, డబ్బులు, రవాణా సౌకర్యాన్ని కల్పించడంలో పూర్తిగా విఫలమైన కేంద్ర ప్రభుత్వం, రైలులో ప్రయాణించడానికి డబ్బులు అడుగుతోందని మండిపడ్డారు.
ఇప్పుడు కూడా లక్షలాది మంది ఇంకా రోడ్లపై తమ స్వస్థలాలకు నడుస్తూనే ఉన్నారని, వారంతా వెంటనే గమ్యానికి చేరేందుకు ఏర్పాట్లు చేయాలని సోనియా గాందీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమ పార్టీ ఎన్నిమార్లు విజ్ఞాపనలు చేసినా, కేంద్రం, రైల్వే మంత్రిత్వ శాఖలు పెడచెవిన పెట్టాయని విమర్శలు గుప్పించారు.