Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాతో కలిసి నడిచి పాక్‌ తప్పుచేసింది!: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ అంతర్మథనం

  • సీఎఫ్‌ఆర్‌ మేధోవర్గం సదస్సులో వ్యాఖ్యలు
  • 9/11 దాడుల తర్వాత తటస్థంగా ఉండాల్సింది
  • అగ్రరాజ్యంతో చేతులు కలపకుండా ఉంటే బాగుండేది
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాతో చేతులు కలిపి తాము చాలా నష్టపోయామని, అలా చేయకుండా ఉండాల్సిందని పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇప్పుడు వాపోతున్నారు. న్యూయార్క్‌లో జరిగిన విదేశీ సంబంధాల మండలి (సీఎఫ్‌ఆర్‌) మేధోవర్గం సదస్సులో ఇమ్రాన్‌ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పద్దెనిమిదేళ్ల క్రితం అంటే 2001 సెప్టెంబర్‌ 11న అల్‌ఖైదా ఉగ్రవాదులు న్యూయార్క్‌ మన్ హట్టన్లోని వాణిజ్య భవనాలు (డబ్య్లూటీసీ) ట్విన్‌ టవర్స్‌పై విమానాలతో దాడులు చేసి కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 2,976 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 6 వేల మంది గాయపడ్డారు.

అమెరికాలాంటి అగ్రరాజ్యం ఈ దాడులతో చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసేందుకు అమెరికా పలు చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పాకిస్థాన్‌ సైనిక స్థావరాల సమీపంలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ను 2011, మే 2వ తేదీన అమెరికా దళాలు అర్ధరాత్రి దాడిచేసి మట్టుబెట్టిన విషయం తెలిసిందే.

పాకిస్థాన్‌ సైన్యానికి తెలిసే ఇదంతా జరిగిందన్నది అప్పటి చర్చ. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ 9/11 తర్వాత సంఘటనలపై ఇప్పుడు వాపోవడం చర్చనీయాంశమైంది. ఉగ్రవాదంపై పోరుకోసం అమెరికాతో చేతులు కలపకుండా తటస్థంగా ఉండాల్సిందని, చేతులు కలిపి భారీ మూల్యం చెల్లించుకున్నామని ఇమ్రాన్‌ వాపోయారు.  దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Pakistan
america
terrorist activities
imrankhan

More Telugu News