సుప్రీంకోర్టు ఆదేశాలలోని పేరు మార్చేసిన రిజిస్ట్రీ సిబ్బంది.. సీరియస్ అయిన న్యాయమూర్తులు
- ఆమ్రపాలి కేసులో ఆడిటర్ పేరు మార్పు
- విషయం తెలిసి ఆశ్చర్యపోయిన ధర్మాసనం
- అవకతవకలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
ఆమ్రపాలి గ్రూప్‌నకు సామగ్రి సరఫరా చేస్తున్న జ్యోతింద్ర స్టీల్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్ డైరెక్టర్లు మే 9 నుంచి పవన్ అగర్వాల్ అనే ఆడిటర్ ముందు హాజరై వివరాలు సమర్పించాలని బెంచ్ ఆదేశించింది. అయితే కోర్టు సిబ్బంది ఆర్డర్ కాపీలో అగర్వాల్‌కు బదులు రవీందర్‌భాటియా పేరు చేర్చారు.
బుధవారం విచారణ సందర్భంగా గమనించిన ధర్మాసనం, ఆర్డర్ కాపీలో పేరు మార్పుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు సిబ్బందిని మభ్యపెట్టి అవకతవకలకు పాల్పడదామనుకునే వారి ఆటలు సాగనియ్యబోమని హెచ్చరించింది. వ్యవస్థను నాశనం చేయాలని చూసే వారిని నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపిస్తామని స్పష్టం చేసింది.