డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు, స్మార్ట్ ఫోన్... చంద్రబాబు మరో కీలక నిర్ణయం!
- 26న స్వయం సహాయక సంఘాల మహిళలతో సభ
- కీలక నిర్ణయాలు ప్రకటించనున్న చంద్రబాబు
- ఫిబ్రవరిలో డబ్బు అందించే అవకాశం
- స్మార్ట్ ఫోన్లకు మూడేళ్ల రీచార్జ్ కూడా
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డ్వాక్రా మహిళలకు 'పసుపు - కుంకుమ' పేరిట రూ. 2,500 చొప్పున నాలుగు విడతల్లో రూ. 10 వేలను చంద్రబాబు అందించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇవ్వదలచిన రూ. 10 వేలను రెండు విడతలుగా ఇవ్వాలా? లేక మూడు విడతల్లో ఇవ్వాలా? అన్నది ఆర్థిక వనరుల లభ్యతపై ఆధారపడివుంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. తొలి విడతను రెట్టింపు చేసిన పింఛన్ల మొత్తంతో పాటే ఫిబ్రవరిలో అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే, ఇప్పటికే వాటి కొనుగోలుకు టెండర్లను పిలిచారు. రెండు కంపెనీలతో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ఫోన్ తో పాటు వాటిని మూడు సంవత్సరాలు రీచార్జ్ చేయించాలన్న ప్రతిపాదనపైనా 26 నాటి సమావేశంలో చంద్రబాబు నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉండగా, వారికి రూ. 10 వేల చొప్పున ఇవ్వడానికి రూ. 9,400 కోట్లు కావాలి. ఇక ఒక్కో స్మార్ట్ ఫోన్ ఖరీదు రూ. 4 వేలుగా లెక్కేసినా, అందుకు రూ. 3,760 కోట్లు, మూడు సంవత్సరాల రీచార్చ్ వ్యయం కనీసం మరో రూ. 240 కోట్ల వరకూ ఉండవచ్చని అంచనా.